యాదాద్రి, ఫిబ్రవరి 6:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం మార్చి 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే కొండపై ప్రధానాలయం, శివాలయం, పుష్కరిణి, స్వర్ణవర్ణపు క్యూలైన్ల పనులు, లిఫ్ట్, ప్రసాదవిక్రయశాల భవనం, రథశాల పూర్తికాగా క్యూ కాంప్లెక్స్, బస్‌టెర్మినల్, స్వాగత తోరణం, ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరాయి. సప్తతల రాజగోపురాలపై కలశ స్థాపనకు పరంజా పనులు జరుగుతున్నాయి. పడమటి సప్తతల, పంచతల, రాజగోపురాలతోపాటు స్వామివారి గర్భాల విమానగోపురానికి పరంజా బిగింపు పూర్తయ్యింది. కొండ చుట్టూ 5 కిలోమీటర్ల మేర రింగురోడ్డు పనులు పూర్తికాగా గ్రీనరీ పనులు 95 శాతం పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి పనులు దాదాపుగా పూర్తికాగా గండిచెరువు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మార్చి 22న నిర్వహించే సుదర్శన మహాయాగానికి కావాల్సిన 75 ఎకరాల స్థలాన్ని వైటీడీఏ అధికారులు సిద్ధం చేశారు.
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..
గతేడాది అక్టోబర్ 19న యాదాద్రిలో 16వ సారి పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో యాదాద్రి నూతనాలయాన్ని పునః ప్రారంభించాలని ప్రకటించారు. నాటి నుంచి ఆలయ పనుల్లో వేగం పెంచడంతో పాటు స్వామివారి స్వయంభువుల దర్శనాన్ని ప్రజలకు అందించాలని అంకుఠిత దీక్షతో పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుదర్శన మహాయాగం, ఆలయ పునః సంప్రోక్షణ, ఇతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిలో చర్చించనున్నారు. పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
పరంజా పనులపై ప్రత్యేక కమిటీ నిర్ధారణ…
85 అడుగుల సప్తతల రాజగోపురానికి బిగించిన పరంజాను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఎన్సీ రవీందర్రావు, గణపతిరెడ్డి, ఈఓ ఎన్. గీత, టెక్నికల్ కమిటీ నిర్ధారించింది. ఆలయ పునః ప్రారంభ సమయంలో ప్రముఖులు, అర్చకులు, పూజారులు సప్త రాజగోపురాలపైకెక్కి విశేష పూజలు చేయనున్నారు. ఈ మహాక్రతువులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, రుత్వికులు, వేద పండితులు, దేశంలోని ఉన్న ప్రముఖ దేవాలయాల అర్చకులు, పాల్గొంటారు. ఈ క్రమంలో కలశ స్థాపనకు రాజగోపురాలను ఎక్కాల్సి ఉంటుంది. సమారుగా 50 మంది వివిధ విశేష పూజలు చేయాల్సి ఉంటుంది. చెన్నై నుంచి వచ్చిన నిపుణుల ఆధ్వర్యంలో పరంజా పనులు జరుగుతున్నాయి.
తుది దశకు గర్భాలయంలో పుత్తడి పనులు..
స్వామివారి గర్భగడి ముఖ ద్వారం తలుపులకు బంగారు తొడుగుల బిగింపు పూర్తయ్యింది. 14 నారసింహ విగ్రహాలు, 36 కమలం పుష్పాలతో పాటు 36 గంటలను అమర్చారు. ద్వార బంధాన్ని చిలుక ఆకృతిలో రూపొందించారు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులు తుది దశకు చేరుకున్నాయి. మహాద్భుతంగా తీర్చిదిద్దిన స్వర్ణవర్ణపు తొడుగులను ధ్వజస్తంభం పీఠానికి బిగించారు. 1,785 గ్రాముల మేలిమి బంగారంతో చైన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ ప్రత్యేక స్వర్ణ తాపడాలను చేయగా ఇందుకు కావాల్సిన రాగి పనులు మహాబలిపురానికి చెందిన అనుభవజ్ఞులైన శిల్పి రవీంద్రన్ రూపొందించారు. ధ్వజస్తంభానికి ముందుభాగంలో బలిపీఠానికి బంగారు వర్ణపు తొడుగుల బిగింపు పనులు జరుగుతున్నాయి.
పనులు చక చకా..
కొండపై ఎస్ఫీఎఫ్ భవనం, బస్ బే నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఆ పక్కనే క్యూ కాంప్లెక్స్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. కొండపైకి వెళ్లేందుకు ఒక ఫ్లై ఓవర్, కిందికి వచ్చేందుకు మరో ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. కొండకింద వైకుంఠ ద్వారం నుంచి పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న శ్రీవారి మెట్ల పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. తూర్పు రాజగోపురం ఎదురుగా బిగించిన స్వర్ణవర్ణపు క్యూ లైన్ల పనులు పూర్తయ్యాయి. ఆలయానికి పసిడి కాంతుల విద్యుద్దీపాలంకరణ పూర్తికాగా, మరింత కాంతివంతమైన వెలుతురు వచ్చేలా పనులు సాగుతున్నాయి. కొండపై లడ్డూ ప్రసాద విక్రయశాల మానవ రహిత యంత్రాల బిగింపు పూర్తయి లడ్డూ తయారీ ట్రయల్ విజయవంతమైంది. కొండపైకి వెళ్లేందుకు, దర్శనం అనంతరం తిరిగి వచ్చేందుకు నిర్మించిన ప్రథమ, ద్వితీయ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయి. కిందికి వెళ్లే ఫ్లై ఓవర్ పనులు దాదాపుగా పూర్తికాగా మరో వారం రోజుల్లో భక్తులకు అందుబాటులోకి రానుంది. కొండపైకి వచ్చే ఫ్లై ఓవర్‌కు లండన్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన కేబుల్ బ్రిడ్జిని నిర్మించేలా పిల్లర్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇందుకోసం రూ.63కోట్లు వెచ్చించారు. ఆలయ ప్రహరీకలిసే సముదాయం వద్ద భక్తి భావం ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన స్వాగత తోరణం పనులు కొనసాగుతున్నాయి. 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో రెండు మార్గాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. కొండకింద గండి చెరువు ఆధునీకరణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. వర్షం నీళ్లు చెరువులోకి రాకుండా చుట్టూ అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులు సాగుతున్నాయి. గండి చెరువులోకి గోదావరి జలాలు రానున్న నేపథ్యంలో ప్రతి నెలా లేక 15 రోజులకోసారి నీటిని బయటకు విడుదల చేసేందుకు కాల్వ పనులు జరుగుతున్నాయి.
సుదర్శన మహాయాగానికి 75 ఎకరాల స్థలం..
యాదాద్రి ప్రధానాలయ పునః ప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 22న సుదర్శన మహాయాగాన్ని 1,035 హోమ గుండాలతో నిర్వహించనున్నారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని వైటీడీఏ అధికారులు కేటాయించారు. ప్రధానాలయం కొండకింద ఈశాన్య ప్రాంతంలో యాగాల నిర్వహణకు 75 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ అర్కిటెక్చరల్ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ పరిశీలించి, దేవాదాయశాఖ మంత్రికి నివేదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, త్రిదండి చినజీయర్‌స్వామి సలహాలు, సూచనల మేరకు హోమాలు జరుపాల్సిన స్థలాల్లో ఏ ప్రాంతంలో గుండాలను ఏర్పాటు చేయాలన్న వాటిపై అధికారులు సమీక్షిస్తున్నారు. నీటి వసతి, పార్కింగ్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, వీవీఐపీ తాకిడిని తట్టుకునేలా రోడ్లు, స్థలాల కేటాయింపు పనులు జరుగుతున్నాయి.