యాదాద్రి, ఫిబ్రవరి 6 : ఆలేరు నియోజకవర్గంలో మరో 11 చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి రూ.24.71 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు.. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు వాగుల్లో 35 చెక్‌డ్యామ్‌లు నిర్మించి అందుబాటు లోకి తెచ్చినట్లు ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా కరువుపీడిత ప్రాంతంగా ఉన్న ఆలేరు నియోజకవర్గం.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం సాగునీటితో కళకళలాడుతున్నదని పేర్కొన్నారు. వర్షాకాలంలో వరదనీరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు వాగుల్లోకి వెళ్లి వృథా అవుతున్నాయని, ఈ విషయాన్ని తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గతంలో ఉన్న చెక్ డ్యామ్‌ను రూ.4.59 కోట్లతో ఆధునీకరించి మరో కొత్త చెక్‌డ్యామ్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 11 చెక్‌డ్యామ్‌లు మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన నవాబ్‌పేట జలాశయం, ఆశ్వరావుపల్లి కాల్వల ద్వారా ఆలేరు, గుండాల మండలాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయం ద్వారా బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలు, నృసింహస్వామి జలాశయం డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూర్, రాజాపేట, ఆత్మకూరు(ఎం) మండలాలకు గోదావరి జలాలు రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గుండాల, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలకు గోదావరి జలాలు చేరాయని, త్వరలో అన్ని మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కరువుపీడిత ప్రాంతమైన ఆలేరు కొనసీమను తలపించేలా ప్రణాళికలు సాగుతున్నాయని తెలిపారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సహకరించిన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.