యాదాద్రి భువనగిరి, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రైతుల్లో ఆసక్తిని పెంచేందుకు ఆయిల్ ఫెడ్ సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. తొలుత ప్రయోగాత్మకంగా ఆయిల్‌పామ్ సాగును చేపట్టి ఆ ఫలితాలను రైతులకు చూపించడం ద్వారా అటువైపుగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఆయిల్‌పామ్ సాగును చేపట్టాలని సంకల్పించి జిల్లాలో వలిగొండ మండలంలోని వేములకొండ నుంచి శ్రీకారం చుట్టింది. వెంకటేశ్వర్‌రెడ్డి అనే రైతుకు సంబంధించిన 13 ఎకరాల్లో ఇప్పటికే మొక్కలను నాటే ప్రక్రియను చేపట్టింది. ఇంతకుముందే జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని చిన్నలక్ష్మాపురం గ్రామానికి చెందిన హరిబాబు తన పొలంలో ఆయిల్‌పామ్ సాగును స్వచ్ఛందంగా మొదలుపెట్టాడు. ఇందుకు కావాల్సిన మొక్కలను ఆయిల్ ఫెడ్ సంస్థ సిద్దిపేట, గజ్వేల్, అశ్వరావుపేట నుంచి తెప్పించింది. వేములకొండలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న రైతుకు కూడా ఆయిల్‌ఫెడ్ సంస్థనే మొక్కలను సమకూర్చగా ప్రభుత్వ పరంగా రాయితీలు సైతం అందనున్నాయి.
పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ
వ్యవసాయంలో ఏ పంటకైనా చీడ పీడల బాధ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆయిల్ పామ్‌లో ఆ బాధలు అంతగా ఉండవు. అంతేకాకుండా తుఫాన్, భారీ వర్షాలు, ఈదురు గాలుల సందర్భాల్లోనూ చెట్లు తట్టుకుని నిలబడుతాయి. ఈ సాగులో పెట్టుబడి కూడా తక్కువే. మొదటి మూడేండ్లు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పంట ఉత్పత్తులు ప్రారంభమయ్యే నాలుగో ఏడాది నుంచి పెట్టుబడి ఖర్చు అంతగా ఉండదు. మార్కెట్లో గెల టన్నుకు రూ.9,500 ధర పలుకుతుండడంతో ఎకరానికి 10 టన్నుల దిగుబడి వచ్చినా పెట్టుబడి ఖర్చులు పోను కనీసం రూ.70-80 వేల వరకు ఆదాయం వస్తుంది. అంతరపంటగా ఇతర పంటలను సైతం సాగుచేసుకోవచ్చు. ఈ సాగును చేపట్టిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలోనూ రాయితీని అందిస్తున్నాయి. ఇక పంట ఉత్పత్తులకు ఇబ్బందులు ఉండకుండా మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇప్పటికే పామాయిల్ సాగులో ఉన్న జిల్లాల్లో మార్కెటింగ్ బాధ్యతలను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించగా.. జిల్లాలో ఆ బాధ్యతలను ఆయిల్ ఫెడ్ సంస్థకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం
రైతులను రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే రైతులను ఆయిల్‌పామ్ సాగు దిశగా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. ఆయిల్‌ఫెడ్ సంస్థలోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆయిల్‌పామ్ సాగును రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు కేంద్రం నుంచి అనుమతులు తెప్పించాం. ఈ ఏడాది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సాగు 10వేల ఎకరాల్లో కానున్నది. ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యం మేరకు రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా వలిగొండ మండలంలో ఆయిల్‌పామ్ సాగును మొదలుపెట్టాం.