యాదాద్రి, జనవరి 23 : ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన రాలేదని, అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే రావడం దేవుడిచ్చిన వరం అని సినీ నటుడు సుమన్ అన్నారు. యాదాద్రి ఆలయాన్ని భారతదేశంలో ఓ గొప్ప స్థాయికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రిలో సింహ ఎన్క్లేవ్ ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ యాదాద్రి ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్ది హిందువులకు వరంగా ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా సాగుతున్నదని తెలిపారు.
డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.1,100 కోట్లతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరుగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ 19 ధపాలు యాదాద్రిలో పర్యటించి వెయ్యేండ్లు నిలిచిపోయేలా ఆలయాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో యాదాద్రి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, ఆరె స్వామిగౌడ్, ఎండీ హుస్సేన్, అక్బర్ పాల్గొన్నారు.