అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం ( Srisailam) ఆలయంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి (Mahashivaratri ) బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయంలో ప్రారంభ పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం తరువాత పూజలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ రమేష్, ఈవో శ్రీనివాసరావు వివరించారు. ఈనెల 18 వరకు కొనసాగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
ఆదివారం రాత్రి 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఎగురవేస్తామన్నారు. భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం , ఆదివారం నుంచి 12వ తేదీ వరకు జ్యోతిర్ముడి శివ దీక్ష భక్తులకు మల్లన్న స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నల్లమల అడవుల నుంచి పాదయాత్రగా తరలివస్తున్నారు. ఈసారి సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని దేవస్థానం యంత్రాంగం భావిస్తుంది. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒకేసారి 3,140 నిలిపేందుకు 13.80 ఎకరాలను సిద్ధం చేశామన్నారు.