యాదాద్రి, జవనరి 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. నూతన సంవత్సర ప్రారంభంతో పాటు సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 35వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ధర్మదర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని తెలిపారు. శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ వీధుల్లో సందడి నెలకొంది. క్యూలెన్లలో, ఆలయ సన్నిధిలో తిరువీధుల్లో భక్తుల రద్దీ కనిపించింది. యాదాద్రీశుడి దర్శనం కాని పలువురు భక్తులు పాతగుట్టలో స్వామిని దర్శించుకుని వెనుదిరిగారు. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు, హారతి నివేదనలు చేశారు.
ఉదయం 8గంటలకు సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకొనే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయ స్వామికి నిర్వహించిన పూజల్లో, సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించి భక్తులకు వినిపించారు.శ్రీవారి ఖజానాకు శనివారం రూ. 30,54,187 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.