Divija Prabhakar | ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ని అధికారికంగా ప్రకటించారు. పల్లెటూరి నేపథ్యంలో క్యూట్ లవ్ స్టోరీకి ఫాదర్ సెంటిమెంట్‌ను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు మురళీధర్ గౌడ్, సుధ, కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ కథ రూపొందినట్లు చిత్రబృందం తెలిపింది.
ఇటీవల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను లాంచ్ చేశారు. పోస్టర్లో పల్లెటూరి వాతావరణం, కుటుంబ అనుబంధాన్ని ప్రతిబింబించే విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, “టైటిల్ చాలా బాగుంది, సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. టీమ్‌కి అల్ ది బెస్ట్” అని అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో మాట్లాడిన నటుడు మురళీధర్ గౌడ్, సినిమాలో తాను పోషించిన ‘వెంకట్రామయ్య’ పాత్ర ఎంతో ప్రత్యేకమైందని, ఎంతో మనసు పెట్టి నటించానని తెలిపారు. ఈ చిత్రంలో ఒక మంచి సందేశం ఉంటుందని, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలానే ఉన్నాయని చెప్పారు.
నిర్మాత కోమలి మహేందర్ మాట్లాడుతూ, తాను ముందుగా సింగర్‌గా ఉన్నానని, ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఆనందంగా ఉందన్నారు. చిత్రాన్ని ఉగాది సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, “ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఆహ్లాదకరమైన సినిమా. ‘శతమానం భవతి’, ‘బలగం’, ‘ఆ నలుగురు’ తరహాలో భావోద్వేగాలు, అనుబంధాలు ప్రధానంగా ఉండే కథ” అని వివరించారు. గ్రామీణ జీవితం, తండ్రి-కూతురు బంధం, ప్రేమకథ అన్నీ కలిసిన ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు.ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించనుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఉగాది రిలీజ్ టార్గెట్‌తో చిత్రబృందం పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.