యాదాద్రి, డిసెంబర్ 6 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించడంతో పాటు, సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవ జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పూర్వగిరి(పాతగుట్ట)లో నరసింహ స్వామి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో పురోహితులు పరమశివుడికి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే శివుడిని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో అలంకరించారు. శివాలయ ప్రధాన పురోహితుడి ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. శ్రీవారి ఖజానాకు సోమవారం రూ. 12,29,023 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
కనీవిని ఎరుగని రీతిలో ఆలయ పునర్నిర్మాణం :ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
సీఎం కేసీఆర్ కఠోర శ్రమతో యాదాద్రీశుడి ఆలయం కనీవిని ఎరుగని రీతిలో పునర్నిర్మిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆలయ నిర్మాణంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. సోమవారం ఆయన కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదాద్రిని తీర్చి దిద్దడం సీఎం కేసీఆర్‌కు స్వామి వారు ఇచ్చిన గొప్ప అవకాశమన్నారు. దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఆలయాభివృద్ధిని పట్టిం చుకోలేదని విమర్శించారు. ఏపీలో తిరుపతిని తీర్చిదిద్దిన్న ట్లుగా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ఏఈఓలు గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రవణ్‌కుమార్, నాయకులు కర్రె వీరయ్య, ఆరె శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.