కొలంబో: టీ20 వరల్డ్కప్(T20 World Cup)లో ఆదివారం పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ జరగనున్నది. ఉత్కంఠభరిత ఆ పోరు కోసం రెండు జట్లూ సిద్ధం అవుతున్నాయి. అయితే ఆ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనున్నది. అక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం కొలంబోను వంద శాతం మేఘాలు కమ్ముకోనున్నాయి. సాయంత్రం వేళ సుమారు 13 శాతం మాత్రమే వర్షం పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలోని ఆగ్నేయ దిశలో అల్పపీడనం ఏర్పడనున్నది, దీని వల్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు శ్రీలంక వెదర్ శాఖ పేర్కొన్నది.
వరల్డ్కప్ టోర్నమెంట్లోనే ఇండోపాక్ మ్యాచ్కు ఎక్కువ క్రేజీ ఉన్నది. ఇప్పటికే ఈ రెండు దేశాలు తమ గ్రూపుల్లో తొలి రెండు మ్యాచ్లను నెగ్గేశాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే అప్పుడు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉన్నది. భారత్తో ఆదివారం జరిగే మ్యాచ్ను ఆడేందుకు తొలుత పాకిస్థాన్ అంగీకరించలేదు. కానీ ఐసీసీ అల్టిమేటంతో దిగివచ్చిన పాక్ ఆ మ్యాచ్లో ఆడేందుకు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. అక్యూవెదర్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రేమదాస స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నది. అంటే మ్యాచ్ మొదలు కావడానికి రెండు గంటల ముందు వర్ష సూచన ఉన్నది. కానీ మ్యాచ్ టైంలో వర్షం లేనట్లు చెబుతున్నారు. టెంపరేచర్ 27 డిగ్రీలు, హ్యుమిడిటీ 70ఎస్ ఉండనున్నది.