
యాదాద్రి, జూలై3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శ న క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీఅర్చనల వరకు నిత్యపూజలను అర్చకులు వైభవంగా చేపట్టారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హార తి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యతిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబుచేసి బాలాలయ ముఖమండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయంలో అష్టోత్తర పూ జలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్రపాలక ఆంజనేయస్వామి వారికి జరిగిన పూజల్లోనూ భక్తులు పాల్గొని తరించారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రీశుడి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
యాదాద్రీశుడిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు వారికి స్వామివారి ప్రత్యేక ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం జస్టిస్ చల్లా కోదండరాం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణం మహాద్భుతంగా సాగుతున్నదన్నారు. పూర్తికృష్ణ శిలలతో నిర్మించిన ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని కితాబునిచ్చారు.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర..
స్వామివారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకు లు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికి, స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
స్వామివారి ఖజానాకు రూ.14,77,657 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.14,77,657 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ.2,17,934, రూ.100 దర్శనంతో రూ.28,500, వీఐపీ దర్శనాలతో రూ.60,000, నిత్యకైంకర్యాలతో రూ.2,601, సుప్రభాతం ద్వారా రూ.1,000, క్యారీబ్యాగులతో రూ.4,000, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.58,000, కల్యాణకట్టతో రూ.18,000, ప్రసాద విక్రయంతో రూ. 4,87,590, శాశ్వత పూజలతో రూ.17, 232, వాహనపూజలతో రూ.7,400, టోల్గేట్తో రూ.1,140, అన్నదాన విరాళంతో రూ.36,804, సువర్ణపుష్పార్చన ద్వారా రూ.92,220, యాదరుషి నిలయంతో రూ.61,540, పాతగుట్టతో రూ. 31,550, టెంకాయల విక్రయాలతో రూ. 42,000, ఇతర విభాగాలతో రూ. 3,10, 146తో కలుపుకొని రూ.14,77, 657 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
దేశమే గర్వపడేలా ఆలయ నిర్మాణం..
గత పాలకుల చేతిలో నిరాదరణకు గురైన యాదాద్రి పుణ్యక్షేత్రం సీఎం కేసీఆర్ పాలనలో దేశమే గర్వపడేలా రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, యువజన సర్వీసులు, సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం యాదాద్రీశుడిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ప్రత్యేక స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి మాట్లాడుతూ యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి పర్చడంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు.