
యాదాద్రి భువనగిరి, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాసాలమర్రి..ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న ఊరి పేరు. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ కూడా పదేపదే ఈ గ్రామం గురించే పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఈ గ్రామం గురించి ఎవరికీ అంతగా తెలియకపోగా.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని గ్రామాన్ని సందర్శించడంతో..ఈ గ్రామం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రణాళికల తయారీ..కమిటీల ఏర్పాటు తదితర వాటికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇదే క్రమంలో గ్రామస్తులు సైతం ఒక్కతాటిపై నిలిచేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. మంగళవారం గ్రామస్తులంతా కలిసి శ్రమదానం చేశారు. ఇండ్ల మధ్యన పెరిగిన ముళ్ల చెట్లను తొలగించడంతోపాటు, చెత్తా చెదారం లేకుండా శుభ్రపర్చారు. విప్లవాత్మక మార్పుకు తొలి అడుగు పడటంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది.
గత ఏడాది అక్టోబర్‌లోనే బీజం
వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి గత యేడాది అక్టోబర్‌లోనే బీజం పడింది. గత ఏడాది అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద ఆగిన సీఎం కేసీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను సీఎం వద్ద ప్రస్తావించగా..సమస్యలపై చర్చించేందుకు ఫాంహౌజ్‌కు రావాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో ఫాం హౌజ్‌కు పిలిపించుకుని గ్రామ సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ అంకాపూర్ తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. రూ.100 కోట్లు ఖర్చైనా సరే! వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారుల బృందం వాసాలమర్రిలో పర్యటించి గ్రామ అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి కల్పించే విషయమై బ్లూప్రింట్ రూపొందించి సిద్ధం చేసి ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 18న సీఎం కేసీఆర్ వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకు ఫోన్ చేసి గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం..ఈనెల 22న వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయడంతోపాటు, గ్రామ సభ నిర్వహించి గ్రామ సమగ్ర అభివృద్ధిపై కూలంకుషంగా మాట్లాడారు.
శ్రమదానంతో తొలి అడుగు
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయి. ఇప్పటికే అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్, సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామాలకు దీటుగా వాసాలమర్రిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. గ్రామ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలాసత్పతిని నియమిం చడం.. కలెక్టర్ గ్రామ సందర్శనకు వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను కలిసి వచ్చాక.. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారయంత్రాంగం వేగవంతం చేసింది. గతంలోనే భౌగోళిక సర్వేతో పాటు ఇంటింటి సర్వే చేసి బ్లూప్రింట్‌ను తయారు చేయగా.. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మరోసారి సమగ్ర సర్వేను నిర్వహించనున్నారు. ఆ సర్వేకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు
కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. ఈనెల 25న కలెక్టర్ వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి ప్రధాన కమిటీతోపాటు హరితహారం, పారిశుధ్యం-తాగునీరు, శ్రమదానం, వ్యవసాయం, మౌలిక వసతులు, మార్కెటింగ్‌లకు సంబంధించి ఆరు కమిటీలు ఏర్పాటు చేయించారు. వారంలో ఒక రోజు రెండు గంటలపాటు శ్రమదానం నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించడంతో..మంగళవారం గ్రామం లో స్థానికులంతా కలిసి శ్రమదానం నిర్వహించారు. ఇండ్ల మధ్యనే ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లు, పిచ్చిచెట్లను తొలగించారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రపర్చారు. సమష్టిగా అందరూ కలిసి ముందుకు రావడం తొలి విజయంగా స్థానికులు పేర్కొంటున్నారు. శ్రమదాన కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, ఎంపీవో శ్రీమాలిని, గ్రామస్తులు కొక్కొండ సత్యనారాయణ, తడక బాలరాజు, గుంటి సత్తయ్య, కొత్తింటి కృష్ణ, యాదగిరి, సురేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి ఆత్మైస్థెర్యం నింపింది
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఇచ్చిన స్ఫూర్తి మాలో ఆత్మవిశ్వాసం నింపింది. సారు చేప్పిన విధంగా మేమంతా ఇకపై ఐకమత్యంతో ముందుకు సాగి గ్రామాన్ని అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకుంటాం. గ్రామస్తులంతా కలిసి ముళ్లచెట్లను తొలగించడంతోపాటు చెత్తాచెదారం శుభ్రం చేశాం.
-కరికె బాలురాజు, గ్రామస్తుడు వాసాలమర్రి
ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాం
గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. గ్రామాభివృద్ధికి ఏడు అభివృద్ధి కమిటీలు వేసుకున్నాం. అభివృద్ధి కమిటీల సభ్యులతో కలిసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం.
-పోగుల ఆంజనేయులు, సర్పంచ్ వాసాలమర్రి
గ్రామ రూపురేఖలు మారుస్తాం
గ్రామస్తులందరితో కలిసికట్టుగా ముందుకు సాగు తూ… గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. సీఎం కేసీఆర్ సారు చేసిన దిశానిర్దేశంతో ఏర్పాటు చేసుకున్న అభివృద్ధి కమిటీల సభ్యులంతా ఏకమయ్యారు. అభివృద్ధి కమిటీల సభ్యులతో మార్గదర్శకంగా ఉంటూ గ్రామ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తాం.
-పలుగుల నవీన్‌కుమార్, ఎంపీటీసీ వాసాలమర్రి
గ్రామాన్ని దత్తత తీసుకోవడం సంతోషం
అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉన్న మా గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మా గ్రామంలో ఆడుగుపెట్టినప్పుడే గ్రామ సమస్యలు షరిష్కారమై అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుందనే నమ్మకం ఏర్పడింది. గ్రామస్తులంతా ఒక్కటై గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటాం.
-గుంటిపల్లి సత్తయ్య, గ్రామస్తుడు, వాసాలమర్రి