సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద జలమండలిని విస్తరించింది. మౌలిక వసతులు, కావలసినంత సిబ్బందిని సమకూర్చుకుండానే విస్తరిస్తున్నట్లు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది. జీహెచ్ఎంసీకి సమాంతరంగా జలమండలి ఉండాలనే ఉద్దేశంతో విస్తరించింది కానీ అందుకు తగ్గట్టుగా సేవలందించేందుకు కావాల్సిన అన్ని వసతులు సమకూర్చడంపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. మూడు జోన్లుగా ఏర్పాటు చేసి వాటికి ఈడీలను నియమించింది కానీ కార్యకలాపాలు చేపట్టేందుకు మాత్రం అనువైన వసతులు కల్పించకపోవడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులను నియమించకుండానే విస్తరణ చేపట్టడంతో పనుల నిర్వహణ తలకు మించిన భారంగా మారనున్నదని చర్చించుకుంటున్నారు. కనీసం కొద్దిమందినైనా నియమించుకుండా ఆగమేఘాల మీద విస్తరణ చేసి కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే కొన్ని సర్కిళ్లలో మేనేజర్ల కొరత వేధిస్తున్నది.
అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సిబ్బంది కంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. విస్తరణకు ముందుగానే 700 మంది ఉద్యోగులు కావాలని జలమండలి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఉద్యోగుల భర్తీని పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రతిపాదించిన ఉద్యోగులను భర్తీ చేసిన తర్వాతనే విస్తరణ చేపడితే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
జలమండలి ఇప్పటిదాకా ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లోనే విస్తరించి ఉండేది. అప్పటికి మొత్తం 1450 చదరపు కిలో మీటర్లు ఉంది. తాజాగా జీహెచ్ఎంసీతో సరిసమానంగా దాన్ని విస్తరించడంతో 2,050 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నది. ఇప్పటిదాకా జలమండలిలో 3,500 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 4,500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 8,000 ఉద్యోగులతో బోర్డు కార్యకలాపాలు సాగించేవారు. అప్పటికీ కొన్ని సర్కిళ్లకు మేనేజర్లు లేకపోవడంతో రెండు మూడు సర్కిళ్లను ఒకరే చూసుకుంటున్నారు. పరిధి మరో 600 చదరపు కిలోమీటర్లు పెరిగింది.కానీ అదే సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. దీంతో కార్యకలాపాలు సాగించేందుకు ఇబ్బందిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు బోర్డు సేవలు అందాలంటే మరో 700 మంది ఉద్యోగులు అవసరమవుతుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా పరిధి పెంచి చేతులు దులుపుకున్నది.