యాదాద్రి, జూన్ 6 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయంగా ఉన్న పర్వత వర్ధినీసమేత రామలింగేశ్వరస్వామివారి ప్రధానాలయ ముఖమండపంలో సోమవారం స్పటికలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. దాంతో పాటు స్వామివారి గర్భాలయంలోని లింగేశ్వరుడికి అర్చకులు, పురోహితులు ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. రామలింగేశ్వరుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించారు. అభిషేక ప్రియుడైన పరమశివుడిని విభూతితోఅలంకరించారు. ఉప ఆలయాల్లో వెలిసిన సుబ్రమణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చించారు. శివాలయం ప్రధాన పురోహితులు అర్చించి, విశేష పుష్పాలంకరణ చేశారు. స్వయంభూ ప్రధానాలయంలో లక్ష్మీనారసింహస్వామి వారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన చేపట్టి ఆరగింపు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో స్వామివారికి సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవల్లో భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. యాదాద్రి కొండకింద దీక్షాపరుల మండపంలోని వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.20,99,439 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.