యాదాద్రి, ఏప్రిల్ 19 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో బుధవారం విఘ్నేశ్వరుడి పూజతో మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలో శుచి, శుభ్రతను నెలకొల్పేందుకు పుణ్యాహవాచనం, మాతృకాపూజ, నాందీముఖం, పంచగవ్య ప్రాశనం, రుత్విగ్వరణం వైభవంగా జరుపనున్నారు. నూతనంగా నిర్మించిన శివాలయంలో ఎలాంటి అశుభాలూ కలుగకుండా, పునర్నిర్మాణంలో దోషం లేకుండారక్షోఘ్నహోమం చేపట్టి అంకురారోపణం, ఉదకశాంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాగే మహోత్సవాలన్నీ స్మార్తాగమ సంప్రదాయరీతిలో జరుగనున్నాయి. 54 మంది ఆచార్య బ్రహ్మ వేదపారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందం పాల్గొననున్నారు. ఇందుకు ప్రధానాలయ శివాలయాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునర్నిర్మాణం సుమారు రూ.1,050 కోట్ల వ్యయంతో యావత్ హిందూ సమాజం గర్వించేలా చేపట్టారు. అదేస్థాయిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించి గత మార్చి 28న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పాంచరాత్రాగమ శాస్ర్తానుసారం పునః ప్రారంభించారు. అనంతరం స్వయం భూ నారసింహుడి దర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పించారు. స్వామివారి ఆలయంలో అనుబంధంగా ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి నూతనాలయాన్ని సైతం అదేస్థాయిలో పునర్నిర్మించారు. రూ.8కోట్ల వ్యయంతో సుమారు ఎకరం స్థలంలో నూతన శివాలయం రూపుదిద్దుకున్నది. ఈ నేపథ్యంలో నెల 20నుంచి 25 వరకు అత్యంత వైభవంగా స్మార్తాగమ సంప్రదాయ రీతిలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. శివాలయ, ఉప దేవీదేవతల ప్రతిష్ఠ, పంచకుండాత్మక పంచాహ్నిక దీక్షా విధానంతో సుమారు 54 మంది ఆచార్య బ్రహ్మ వేద పారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందంతో మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపనున్నారు. 25వ తేదీన ఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తాన పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీరాంపురం(తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్ఫటిక లింగ, ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
యాగశాల సిద్ధం..
మహాకుంభాభిషేకంలో భాగంగా చేపడుతున్న మహారుద్ర యాగశాలను సిద్ధం చేశారు. ఆలయం బయటి పురవీధుల్లోని కల్యాణ మండపం ఎదురుగా యాగశాలను నిర్మించారు. ఎండల నేపథ్యంలో చలువ పందిళ్లను వేశారు. మొత్తం ఐదు యజ్ఞకుండాలతో యాగశాల నిర్మాణం పూర్తయ్యింది. తూర్పున చతురస్రం, ఈశాన్యంలో అష్టఫలక, దక్షిణంలో అర్ధవృత్తం, ఉత్తరంలో పద్మం, పడమర భాగంలో వృత్తం ఆకారంలో నిర్మించి మధ్యలో రామలింగేశ్వరస్వామిని ఆస్థానం చేసేందుకు వేదికను నిర్మించారు. ఈ నెల 21న యాగశాల ప్రవేశంతో ఐదురోజుల పాటు మహారుద్ర యాగాలను నిర్వహించనున్నారు. యాగశాల ప్రవేశం, హోమకుండ సంస్కారం, యాగశాల ద్వారతోరణ పూజ, దీక్షా హోమం, ప్రసాద దిక్స్థుండిల, వ్యాహృతి, ప్రతిష్ఠాంగ, అఘోర మంత్ర హోమాదులు నిర్వహించనున్నారు.
పంచాయతనం పూజా విధానం..
పంచాయతనం అంటే ఐదుగురు దేవతామూర్తులున్న పీఠం అని అర్థం. ‘ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం’ అనే విధానంలో రామలింగేశ్వరాలయంలో పరివార దేవతా విగ్రహాలు, స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలోని ఆగ్నేయంలో సూర్యభగవానుడు, నైరుతిలో గణపతి, వాయువ్యంలో పర్వతవర్ధినీ అమ్మవారు, ఈశాన్యంలో సీతారామచంద్రస్వామి విగ్రహం, మధ్యభాగంలోని ప్రధానాలయం ముఖ మండపంలో స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే దేవతామూర్తుల విగ్రహాలు, లింగాన్ని సిద్ధం చేశారు. ప్రతిష్ఠాపన పీఠాలు శివాలయానికి చేరుకున్నాయి.
ఎకరం విస్తీర్ణం.. 3మెట్రిక్ టన్నుల కృష్ణశిల..
ప్రధానాలయాన్ని పునర్నిర్మించే క్రమంలో శివాలయాన్ని కూడా విశాలంగా విస్తరించారు. గతంలో 500 గజాల్లో మాత్రమే శివాలయం ఉండేది. ఇప్పుడు ఎకరం స్థలంలో నవగ్రహ, ఆంజనేయ స్వామి, మరకత మండపాలు, బయట రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలను నిర్మించారు. ప్రధానాలయంతోపాటు ఉత్తర రాజగోపురాన్ని కూడా పూర్తిగా కృష్ణశిలతోనే తీర్చిదిద్దారు. ఇందుకోసం 3 మెట్రిక్ టన్నుల శిలను వినియోగించినట్లు అలయ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఆంజనేయస్వామి, గణపతి, పర్వతవర్ధినీ అమ్మవారి దేవాలయాలు, యాగశాలను నిర్మించారు. అదే విధంగా ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల అమరిక, అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహాలు అమర్చారు. శివాలయ ముఖ మండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపున ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ స్వాగత తోరణానికి శివపార్వతుల విగ్రహాలను అమర్చారు.
శివాలయం సిద్ధం..
శివాలయ ముఖ మండపంలోని నవగ్రహ మండపం వద్ద పరివార దేవతా శిలామూర్తులకు చేపట్టాల్సిన అధివాస కార్యక్రమాలకు తొట్టిని నిర్మించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూర్తికాగానే నేడో రేపో ఇత్తడి తొడుగు పనులు ప్రారంభించనున్నారు. ముఖ మండపంలో స్ఫటిక లింగం ప్రతిష్ఠాపనకు పీఠాన్ని అధిష్టించారు. ప్రధానాలయ విమాన గోపురం, ఉపాలయాలకు స్వర్ణకలశాలు, కల్యాణ మండపానికి రాగి కలశం ప్రతిష్ఠించేందుకు పరంజా పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
కొనసాగుతున్న మూలమంత్ర జపాలు..
మహాకుంభాభిషేకంలో భాగంగా శివాలయంలో వేద పండితులు, అర్చకులు, పురోహితులు సుమారు 16.50 లక్షల మూలమంత్ర జపాలను చేస్తున్నారు. శివ పంచాక్షరీ జపాలు, నవగ్రహ, గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, రాహుకేతువు జపాలను చేస్తున్నట్లు తెలిపారు. గత మార్చి 3న జపాలను ప్రారంభించిన్నట్లు వారు వివరించారు.
2017లో బాలాలయంలోకి రామలింగేశ్వరాలయం…
2016 ఏప్రిల్ 21న యాదాద్రి ప్రధానాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి స్వామివారి బాలాలయంలోనే పూజా కైంకర్యాలు కొనసాగించగా 2017 మార్చిలో రామలింగేశ్వరాలయాన్ని తొలగించి స్వామివారికి బాలాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానాలయ ప్రారంభ సమయంలో బాల శివాలయాన్ని క్యూ కాంప్లెక్స్‌లోని గదిలోకి మార్చారు.