భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 8 : గిరిజన యువతకు పోలీస్, గ్రూప్-1,4 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎగ్జామినేషన్, శిక్షణకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె అధికారులతో సమావేశమై ఎగ్జామినేషన్, శిక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత శిక్షణకు సంబంధించి ఈ నెల 4నుంచి 11వరకు దరఖాస్తుల స్వీకరణకు ఉంటుందన్నారు. 13న దరఖాస్తుల పరిశీలన, 18న హాల్‌టికెట్లు జనరేట్ అవుతాయని 24న స్క్రీనింగ్ టెస్టు, 28న ఫలితాలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. మే1నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పక్రియ నిర్వహణకు సెంటర్ల ఏర్పాటు, దరఖాస్తుల పరిశీలన, అనుభవం కలిగిన ఫ్యాకల్టీ నియామకం, భోజనం, స్నాక్స్, స్టడీ మెటీరియల్ తదితర ఏర్పాట్లపై యాక్షన్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలన్నారు. ఉచిత శిక్షణ గురించి తెలిసేలా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో చర్యలు తీసుకోవడంతో పాటు, టామ్ టామ్ ఇతర ప్రచార మాధ్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి మంగ్తానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, డీఈఓ నర్సింహ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ పాల్గొన్నారు.