వైభవంగా రథపటోత్సవం
యాదాద్రిలో స్వామికి నిత్యోత్సవాలు
శ్రీవారి ఖజానాకు రూ. 9,95,042
యాదాద్రి, మార్చి 2 : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ శివాలయంలో బుధవారం ఐదో రోజు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో, నిత్య హవనం, శివ పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం నిర్వహించారు. మూల మంత్రజపం వివిధ పారాయణాలు జరిపించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో ‘లక్షబిల్వార్చన’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిత్య స్మార్తాగమ ఆరాధనల అనంతరం స్వామివారి అమ్మవార్ల రథపటోత్సవ వేడుక వైభవంగా నిర్వహించారు. వేడుకలను స్మార్తాగమ సంప్రదాయానుసారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, శివాలయ ప్రధానార్చకులు నర్సింహరాములశర్మ, ప్రధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, అర్చకులు పాలకుర్తి నర్సింహమూర్తి, శ్రీనివాసశర్మ, నందీభట్ల సాయికృష్ణశర్మ, పురోహితులు నాగరాజుశర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
లక్షబిల్వార్చన విశిష్టత
త్రిదళములతో, త్రిగుణాత్మకమై, త్రిజన్మలోని సర్వపాపములను తొలగించగల శివశక్తి తత్తమైన బిల్వ పత్రం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. బిల్వ వృక్షం సాక్షాత్తూ శివ స్వరూపం. మహాశివుడినికి అత్యంత ప్రీతికరమైన దళం బిల్వదళం. అందుకే బిల్వాన్ని శివేష్ట అని అంటారు. బిల్వా పత్రాలు తిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతమని ఆర్యోక్తి. లక్ష్మీదేవి తపస్సు వల్ల బిల్వవృక్షం పుట్టిందని, అందుకే ఆమెను బిల్వ నిలయా అని పిలుస్తారని పురాణోక్తి. బిల్వ పత్రాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నో విశిష్టతలను కలిగిన ఈ దళములతో మహాశివుని ఆర్చించిన శనిదోషములు తొలగి, భక్తుల కోరికలు నెరవేరగవని పురాణ ప్రసిద్ధం.
రథపటోత్సవ విశిష్టత..
పరమ పవిత్రమైన పరమశివుడి రథపటోత్సవ వేడుక ఎంతో ప్రశస్తిని కలిగి ఉందని శివ పురాణంలో పేరొన్నారు. నవ వధూవరులైన పార్వతీ పరమేశ్వరులను సర్వాలంకార భూషితులను గావించి ప్రమధ గణముల వెంట రాగా నందీశ్వరుడు రథపటంపై చిత్రించబడి భక్తుల దర్శనార్థం తిరువీధుల్లో ఊరేగింపు వేడుక నిర్వహించారు. పరమేశ్వర అనుగ్రహం లభించవలయునన్న రథపటారూఢుడైన స్వామిని అమ్మవారిని పరివారగణాన్ని దర్శించవలయునని స్మార్తాగమం సూచిస్తోంది. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అనంతరం అర్ధనారీశ్వరుడిగా మారిన పరమేశ్వరుడు తన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటించారు. తనను ఆశ్రయించిన ప్రమథగణాదులను అనుగ్రహించుచూ నందీశ్వరునికి ఆద్వైత తత్వాన్ని బోధిస్తూ వృషబారుఢుడై రథపటం అచ్ఛాదితం అతిదైవిక చేష్టితములను దర్శింపచేయుచూ సమస్త భూతకోటిని పరవంశిపచేయుచూ ఆనంద సందోహంలో మనుకలు వేయించుట ఈ రథపటోత్సవ వేడుకలోని విశిష్టత.