PM Modi : ఇండియాలో దూసుకుపోతున్న యూపీఐ సేవలు త్వరలో మలేసియాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మలేసియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం మలేసియాలో మోదీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. మలేసియాలో కూడా త్వరలోనే యూపీఐ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
అయితే, ఎప్పటినుంచి అందుబాటులోకి వచ్చేది వెల్లడించలేదు. ఈ సేవలు అక్కడ ఉంటున్న భారతీయులకు మేలు కలిగిస్తాయని మోదీ అన్నారు. మలేసియాలో రాబోయే యూపీఐ సేవలు వీపీఏ (వర్చువల్ పేమెంట్ అడ్రస్), లేదా క్యూఆర్ కోడ్, లేదా మొబైల్ నెంబర్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. బ్యాంక్ అకౌంట్లతో పని లేకుండా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా ఈ సేవలకు భద్రత ఉంటుంది. మరోవైపు దేశంలో యూపీఐ సేవలు దూసుకెళ్తున్నాయి. గత ఏడాది 640 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న వీసా కార్డ్ సేవల కంటే మన యూపీఐ సేవలే అధికం. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సగానికిపైగా ఇండియాలోనే జరుగుతున్నాయి.
ఇక.. మోదీ రెండు రోజుల మలేసియా పర్యటనలో భాగంగా ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రక్షణ, వ్యాపారం, సహకారం,సెమీకండక్టర్ల సరఫరా వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు వివాదాస్పద మత గురువు జాకీర్ నాయక్‌ను ఇండియాకు అప్పగించే అంశంపై కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇండియాకు చెందిన జాకీర్ నాయక్.. కొన్నేళ్లుగా మలేసియాలో ఉంటున్నాడు.