ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. వాంఖడేలో నేపాల్ బౌలర్లను ఉతికేస్తూ యువకెరటం జాకబ్ బెథెల్(55), కెప్టెన్ హ్యారీ బ్రూక్(53)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. బెథెల్ ఔటయ్యాక మిడిల్ ఓవర్లలో బ్రూక్ భారీ షాట్లతో విరుచుకుపడి స్కోర్‌బోర్డును ఉరికించాడు. ఆఖర్లో విల్ జాక్స్(37 నాటౌట్) నాలుగు సిక్సర్లతో విజృంభించగా నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 184 పరుగులు చేసింది.
గ్రూప్ సీలోని ఇంగ్లండ్, నేపాల్ మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. రెండో ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ (1)ను షేర్ మల్లా ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడుతున్న జోస్ బట్లర్(26)ను నందన్ యాదవ్ బోల్తా కొట్టిచాడు. దాంతో.. పవర్ ప్లేలోనే 43 పరుగులకే రెండు బిగ్ వికెట్లు పడ్డాయి.
Some big hits from Will Jacks in the final over takes England past 180 after fifties from Bethell & Brook
Can Nepal’s batters make a match out of this?
LIVE: https://t.co/pV1MibmuO2 pic.twitter.com/XflYriobZk
— ESPNcricinfo (@ESPNcricinfo) February 8, 2026
ఆ దశలో తొలి ప్రపంచకప్ ఆడుతున్న జాకబ్ బెథెల్(55) పెద్ద షాట్లతో చెలరేగాడు. నేపాల్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ 28 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడీ చిచ్చరపిడుగు. ఆకాశమే హద్దుగా ఆడుతున్న బెథెల్‌ను లమిచానే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సామ్ కరన్(2) త్వరగానే ఔట్కాగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్(53) భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు.
బౌండరీలతో చెలరేగిన బ్రూక్, విల్ జాక్స్(39 నాటౌట్)తో కలిసి నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హాఫ్ సెంచరీ తర్వాత బ్రూక్ ఔటైనా.. జాక్స్ బ్యాట్‌కు పనిచెప్పాడు. కరన్ కేసీ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లతో జట్టు స్కోర్ 180 దాటించాడు. బెథెల్, బ్రూక్, జాక్స్ మెరుపులతో ప్రత్యర్థి ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ఇంగ్లండ్.