Organ Donation | మోటకొండూర్, అక్టోబర్ 11: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు మరణంతో ఆరుగురికి కొత్త జీవం ప్రసాదించాడు. అవయవ దానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు.
మోటకొండూర్ మండలంలోని చాడ గ్రామానికి చెందిన గంధమల్ల సైదులు (27) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 2వ తేదీన సాయంత్రం జమ్మికి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తాను ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కంకర రాళ్లపై పడటంతో తల వెనుక భాగంలో తీవ్రగాయమైంది. ఈ ప్రమాదంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సైదులును వెంటనే కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో సైదులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న జీవన్ దాన్ సంస్థ ప్రతినిధులు సైదులు తల్లిదండ్రులు గంధమల్ల రాములు, లక్ష్మీలను సంప్రదించారు. అవయవదానం ప్రాముఖ్యతపై వారికి అవగాహన కల్పించారు. దీంతో సైదులు తమకు దూరమైనప్పటికీ తన అవయవాలు ఇతరుల ప్రాణాలు కాపాడతాయన్న ఆలోచనతో వారు అంగీకరించారు. ఈ క్రమంలో సైదులు నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను సేకరించి అత్యవసరంగా అవసరమైన ఆరుగురికి అమర్చి ప్రాణదానం చేశారు.