
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 57 ఏండ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. ప్రస్తుతం 65 ఏండ్లు నిండిన వారికి మాత్రమే పెన్షన్ అందుతుండగా, అర్హత వయస్సును ప్రభుత్వం ఎనిమిదేండ్లు తగ్గించి దరఖాస్తులను తీసుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,470 అప్లికేషన్లు అందాయి. సరైన అవగాహన లేక ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లగా, ఈ నెలాఖరు వరకు వెసులుబాటు కల్పించారు. అలా మరింత మందికి ఆసరా అందనున్నది. వృద్ధుల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 87,739 మందికి పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.20.14కోట్లను వెచ్చిస్తున్నది. ప్రస్తుతం 65 ఏండ్లు నిండిన వారికి మాత్రమే ఆసరా పింఛన్ ఇస్తున్నారు. అయితే పింఛన్ అర్హతా వయస్సును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 57 ఏండ్లకు తగ్గించింది. ఆగస్టు నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 75,470 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో నల్లగొండ జిల్లా నుంచి అత్యధికంగా 33,872, సూర్యాపేట నుంచి 24,219, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 17,379 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సరైన అవగాహన లేక చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో మరోసారి అవకాశం ఇవ్వాలని ఇటీవల జరిగిన శాసనసభలో పలువురు ఎమ్మెల్యేలు కోరగా సీఎం కేసీఆర్ సమ్మతించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 నుంచి 30 వరకు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అనేక కుటుంబాలకు ఆసరా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్లతో అనేక కుటుంబాలకు ఆసరా కలుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 మాత్రమే పింఛన్‌గా ఇచ్చే వారు. ఇంత తక్కువ మొత్తంతో వారి కనీస అవసరాలు కూడా తీరడం లేదని గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు కాగానే పింఛన్లను భారీగా పెంచారు. దివ్యాంగులకు రూ.3,016, వృద్ధులు, ఇతరులకు రూ.2,016 చొప్పున అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 87,739 మందికి రూ.20.14కోట్లను ప్రభుత్వం పింఛన్ల రూపంలో అందిస్తున్నది. దీంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు గౌరవంగా బతికే అవకాశం ఏర్పడింది.
సద్వినియోగం చేసుకోవాలి
ఆసరా పింఛన్ల అర్హత వయస్సును ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించడంతో అనేక మందికి లబ్ధి కలుగనున్నది. దరఖాస్తుల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను అనుసరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
గతంలో వచ్చిన దరఖాస్తులు
మండలం దరఖాస్తులు
అడ్డగూడూరు 574
ఆలేరు 926
ఆత్మకూరు(ఎం) 721
భూదాన్‌పోచంపల్లి 1,225
భువనగిరి 1,902
బీబీనగర్ 1,054
బొమ్మలరామారం 781
చౌటుప్పల్ 1,598
గుండాల 848
మోటకొండూరు 830
మోత్కూరు 637
నారాయణపురం 995
రాజాపేట 1,035
రామన్నపేట 1,246
తుర్కపల్లి 726
వలిగొండ 1,445
యాదగిరిగుట్ట 836
మొత్తం 17,379