
యాదాద్రి, జూన్28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై ఉన్న శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో భక్తులు రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నరపాటు శివుడిని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడిని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయ ప్రధాన, ఉప ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ నిర్వహించారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి.
ఆర్జిత పూజల కోలాహలం
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శ న హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హో మం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామి వారి ఖజానాకు రూ.11,01,008 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ.1,38,560 రూ.100 దర్శనంతో రూ.11,600, వీఐపీ దర్శనాలతో రూ.52,950, క్యారీబ్యాగులతో రూ. 3,250, సత్యనారాయణ స్వామి వ్రతాలతో 47,500, కల్యాణకట్టతో రూ.26,660, ప్రసాద విక్రయంతో రూ. 5,05,705, శాశ్వత పూజలతో రూ.10,116, వాహన పూజలతో రూ.8,500, టోల్గేట్తో రూ.740, అన్నదాన విరాళంతో రూ.56,797, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 95,020, యాదరుషి నిలయంతో రూ.63,100, పాతగుట్టతో రూ.12,470, టెంకాయల విక్రయంతో రూ. 68,040తో కలుపుకొని 11,01,008 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.