
హైదరాబాద్ జూన్ 27 (నమస్తే తెలంగాణ ): మీ వద్ద కాలం చెల్లిన వాహనం ఉందా..? స్క్రాప్‌లో పడేద్దామనుకుంటున్నారా..? తొందర పడకండి..కొద్దిగా ఖర్చు పెడితే.. దానిని ఎంచక్కా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు…? లేదా ప్రస్తుతం వాడుతున్న వెహికిల్కూ ఆ సదుపాయం కల్పించుకోవచ్చు. నగరానికి చెందిన పలువురు ఔత్సాహికులు ఇంజిన్‌ను తొలగించి, పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుతున్నారు. అంతేకాదు….ఇంధనంతో పాటు విద్యుత్‌తో కూడా నడిచే విధంగా రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి వాహనాలను తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ – రోడ్‌షో ’లో ప్రదర్శించారు. యువతను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల పర్యావరణహిత బైక్‌లను ఈ ప్రదర్శనలో ఉంచారు. పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన ఈ ప్రదర్శనను ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రవాణా శాఖ కమిషనర్ రామ్మెహన్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్రెడ్కో చైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీముద్దీన్, ఎండీ ఎన్. జానయ్య, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా చైర్మన్ డాక్టర్ రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, విద్యుత్‌తో నడిచే బైక్..
పెట్రోల్, విద్యుత్…ఇలా రెండింటితో నడిచే బైక్‌ను నగరానికి చెందిన హైటెక్ ఇన్నోవేషన్ కంపెనీకి చెందిన బి. యశస్వి గోపాల్ రూపొందించారు. ప్రస్తుతం మనం వినియోగించే బైక్‌లో కొద్దిగా మార్పులు చేసి, రెండు రకాలుగా వినియోగించుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఒకే ఒక్క స్విచ్ఛ్‌ను ఆన్‌చేసి పెట్రోల్ అయిపోయినప్పుడు ఎలక్ట్రిక్‌గా, చార్జింగ్ అయిపోయినప్పుడు పెట్రోల్ వాహనంగా మార్చుకోవచ్చని అంటున్నారు. ఇందుకు సుమారుగా రూ. 15వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు.