
యాదాద్రి, జూన్ 27 : యాదగిరిగుట్ట పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. ఆదివారం సుమారు 2 గంటలపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఫలితంగా రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
చౌటుప్పల్‌లో..
చౌటుప్పల్, జూన్ 27:చౌటుప్పల్‌లో ఆదివారం వర్షం కురిసింది. దీంతో చౌటుప్పల్‌లోని అన్ని కాలనీల్లో వరద నీరు చేరింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
చౌటుప్పల్ రూరల్‌లో…
చౌటుప్పల్ రూరల్, జూన్ 27 : చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో లక్కారం, ఖైతాపురం చెరువుల్లోకి వరద చేరింది. సమీప గుట్టల ప్రాంతం నుంచి జాతీయ రహదారి మీదుగా వరద నీరు చెరువులకు చేరాయి.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), జూన్ 27: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. మండల కేంద్రంలోని బిక్కేరు వాగు నీటితో ప్రవహించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుండాలలో…
గుండాల, జూన్ 27: మండల వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. రైతులు ఇది వరకే పత్తి గింజలు వేసి వర్షాలకు వేచి చూస్తున్న తరుణంలో ఆదివారం కురిసిన వర్షం రైతులకు సంతోషనిచ్చింది. వర్షం వరదతో చెరువుల్లోకి నీరు చేరుతున్నది. 66 మి.మీ వర్షం కురిసినట్లు ఎంపీఎస్వో శ్రీనివాస్ తెలిపారు.
రామన్నపేటలో…
రామన్నపేట, జూన్27: రామన్నపేట మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎడతెరపి లేకుండా సుమారు గంటపాటు వర్షం పడింది. 13.08 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో మెట్ట పంటలు సాగు చేస్తూ వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిపురం-రామన్నపేట, కొమ్మాయిగూడెం- రామన్నపేట మార్గాల్లో ఏర్పాటు చేసిన రైల్వే అండర్‌పాస్‌లలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. మునిపంపుల, దబ్బాక గ్రామాల కల్వర్టుల వద్ద వరద నీరు పెద్దఎత్తున ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వరదనీరు చేరడంతో దవాఖాన ఆవరణం జలమయం అయ్యింది.
మోత్కూరులో…
మోత్కూరు, జూన్ 27: ఉపరితల ఆవర్తన ప్రభావంతో మోత్కూరు మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మండలంలో కురిసిన వర్షానికి రైతాంగం సంబురపడింది. నిన్న, మొన్నటి వరకు మెట్ట పంటల సాగు కోసం విత్తిన కంది, పత్తి వంటి విత్తనాలు ఈ వర్షానికి మొలకలు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి మండలంలో 20 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు.