హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తంగా ఉన్నదని తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షణాధికారిణి డాక్టర్ సువర్ణ అన్నారు. సోమవారం అరణ్యభవన్‌లో పులి సంచారంపై వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ అరుణ్‌కుమార్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 8న పులి సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్నట్టు అటవీశాఖ బృందాలు నిర్ధారించినట్టు తెలిపారు.
పులి ఉత్తరదిశగా కదులుతున్నట్టు ట్రాకింగ్ ద్వారా తెలిసిందని, దీంతో గ్రామాల్లో నిఘా పెంచినట్టు వెల్లడించారు. ప్రజలు, పులికి ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు సిద్దిపేట, జనగామ, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఫుణె నుంచి టైగర్ రెస్క్యూ టీం వచ్చిందని, పులి కదలికలు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.