న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఇతరులు మాట్లాడకుండా అడ్డుపడేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంసిద్ధత తెలియచేసిన నేపథ్యంలో విపక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయబేధాలు బయటపడ్డాయి. లోక్‌సభలో నెలకొన్న ప్రతిష్టంభన సోమవారం రెండవ వారంలోకి ప్రవేశించింది. హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పీకర్ ఓం బిర్లాతో ఆంతరంగిక చర్చలు జరిపి లోక్‌సభలో ఏర్పడిన ప్రతిష్టంభనను ముగించే మార్గాలను అన్వేషించారు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రచించిన అముద్రిత పుస్తకంలో పేర్కొన్న 2020 భారత్-చైనా ఘర్షణలోని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఓపత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చదివేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించడంతో ఫిబ్రవరి 2 నుంచి లోక్‌సభలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రభస, గందరగోళం మధ్య సభలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఇదే అంశానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా ఇతర విపక్షాలు మాత్రం బడ్జెట్‌పై చర్చలో పాల్గొనాలని తలపోస్తున్నాయి. సోమవారం కూడా రాహుల్ తన వ్యాఖ్యలను ప్రస్తావించడానికి ప్రయత్నించడంతో సభ పదేపదే వాయిదా పడింది. వార్షిక బడ్జెట్‌పై చర్చను ప్రారంభించమని కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్‌ను స్పీకర్ కోరగా అందుకు ఆయన నిరాకరించారు.