
రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అభివృద్ధి క్రమంలో పరిశ్రమల ఏర్పాటూ అధికమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే గతం కంటే వాయు కాలుష్యం ఎక్కువ వెలువడుతుంది. కానీ, యాదాద్రి జిల్లాలో కాలుష్య తీవ్రతను పచ్చదనం తగ్గిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కల ఫలితంగా కాలుష్య తీవ్రత తగ్గుతూ వస్తున్నట్లు గణంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. పరిశ్రమల ఖిలాగా పేరున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యావరణానికి విఘాతం కలిగించే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు యేటా పడిపోతుండడమే ఇందుకు నిదర్శనం. మొక్కలు పర్యావరణానికి రక్షణ కవచంలా పనిచేస్తుండడమే ఈ పరిణామానికి కారణమని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాలుష్యం తగ్గిందిలా..
పీసీబీ లెక్కల ప్రకారం.. 2017 సంవత్సరంలో జిల్లా వాతావరణంలో 5.9 మైక్రోగ్రాములు ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ 2020 నాటికి 4.8 శాతానికి తగ్గింది. 2020 సంవత్సరంలో 24.5 శాతం ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్ ప్రస్తుతం 23.6 శాతానికి తగ్గుముఖం పట్టింది.
5కోట్లకుపైగా మొక్కలు
హరితహారంలో భాగంగా జిల్లాలో ఏడు విడతల్లో కలిపి ఇప్పటివరకు 5 కోట్లకు పైగా మొక్కలు నాటారు. దాంతో అటవీ విస్తీర్ణం 3.8 శాతానికి మించి పెరిగింది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భూమిపై నివసించే జీవరాశుల మనుగడకు వాయు కాలుష్యం పెనుముప్పుగా పరిణమిస్తోంది. వాహనాలు వెదజల్లే కాలుష్యం, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో వెలువడే కాలుష్యం కారణంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. కర్బన సమ్మేళనాలు, క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోకి చేరడంతో భూతాపం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చి అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వాయు కాలుష్యానికి చెక్ పెట్టింది. ప్రతి ఏటా విస్తారంగా నాటుతున్న మొక్కలతో వెల్లివిరుస్తున్న పచ్చదనం.. వివిధ రూపాల్లో వెలువడుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తున్నది. దశాబ్దాల తరబడిగా పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యాన్ని పచ్చని చెట్లు నియంత్రిస్తుండడంతో సకల జీవరాశులకు ఈ పరిణామం ఊరట గొల్పుతున్నది.
జిల్లాలో పెరుగుతున్న పచ్చదనం
సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో మొక్కలను నాటుతూ వస్తున్నారు. సకల జనులను భాగస్వామ్యులను చేస్తూ పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాలు, ఇళ్ల ముందట, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో అంతటా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ఏడు విడతల్లో ఇప్పటివరకు ఐదు కోట్లకు పైగా మొక్కలు నాటగా.. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 11,788 హెక్టార్లలో ఉన్న అడవుల విస్తీర్ణం 3.8 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణానికి పెరిగింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ప్రాంగణాల్లో సైతం ప్రభుత్వం మొక్కలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఐదేండ్ల కాలంలో చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చాయి.
పరిశ్రమల గుమ్మంలో కాలుష్యం పరార్
రాష్ట్ర రాజధాని చెంతనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా పరిశ్రమలకు గమ్య స్థానంగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయగా.. మరెన్నో సంస్థలు ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటవుతున్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు’ ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. జిల్లా ఏర్పాటు తర్వాత 402 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు 1,024కు పైనే ఉన్నాయి. ఇందులో ఫార్మా కంపెనీలు, స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీలు, బొగ్గు బట్టీలు సైతం ఉన్నాయి. అయితే కాలుష్య నియంత్రణ శాఖ పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్డ్ సిస్టలను ఏర్పాటు చేసి రీసైక్లింగ్ చేయడం ద్వారా వాయు కాలుష్యం చాలావరకు నియంత్రణలోకి వచ్చింది. ఇందుకు హరితహారం సైతం దోహదపడింది. నల్లగొండ, చౌటుప్పల్ ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) ప్రతి నెలా వాతావరణంలోని కాలుష్య పరిమాణాన్ని లెక్కిస్తోంది. ఆ శాఖ వెల్లడించిన నివేదికల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2017 సంవత్సరంలో వాతావరణంలో 5.9 మైక్రో గ్రామ్స్ ఉన్న సల్ఫర్డూ ఆక్సైడ్ 2020 నాటికి 4.8 శాతానికి తగ్గింది. అలాగే 2020 సంవత్సరంలో 24.5 శాతం ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్ 23.6 శాతానికి తగ్గుముఖం పట్టింది.
శుభ పరిణామం..
పరిశ్రమల నుంచి విష వాయువులు బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హరితహారంలో భాగంగా పరిశ్రమల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం. కాలుష్యాన్ని నియంత్రించే శక్తి ఉన్న చెట్లు పెరుగడంతో యాదాద్రి జిల్లాలో కాలుష్యం తగ్గుతూ వస్తున్నది. ఇది శుభ పరిణామం.
మొక్కలు కాలుష్య రక్షణ కవచాలు
వాతావరణంలో సకల జీవరాశులకు, పర్యావరణానికి హాని కలిగించే వాయు కారకాలు అనేకం ఉంటాయి. ఇందులో వాహనాలు నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్పైడ్ చాలా విషతుల్యమైనవి. భూమిపై ఉన్న మొక్కలు విషవాయువులను వడబోసి రక్షణ కల్పిస్తున్నాయి. సూర్యరశ్మి సాయంతో గాలిలోని విష తుల్యమైన కారకాలను కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా గ్రహించి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. తద్వారా ప్రజారోగ్యానికి మొక్కలుఎంతగానో దోహదం చేస్తున్నాయి.