
నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ ప్రభుత్వం
వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ‘నేతన్నకు చేయూత’ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా, ఈ ఏడాది బడ్జెట్లో చేనేత రంగానికి పెద్దపీట వేసి రూ.338కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. చేనేత కార్మికులకు కొండంత భరోసాగా నిలిచిన థ్రిఫ్ట్ పథకాన్ని తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నది. ఈమేరకు ఇప్పటికే రూ.30కోట్లను విడుదల చేసింది. 2017 సంవత్సరంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ‘థ్రిఫ్ట్’కు అనుబంధంగా ‘నేతన్నకు చేయూత’ పేరుతో పోచంపల్లి నుంచే అంకురార్పణ చేశారు. గత ఏడాది ఈ పథకంలో కార్మికులకు రూ.33కోట్ల వరకు లబ్ధికలుగగా.. ఈ పథకాన్ని మరో మూడేండ్లపాటు కొనసాగింపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మిక కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. థ్రిఫ్ట్ పథకంలో ఎక్కువ మంది లబ్ధిపొందేందుకు గాను చేనేత జౌళి శాఖ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రంగురంగుల చీరెలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకులకు భరోసా కల్పించేలా దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోంది. త్రిఫ్ట్, చేనేత మిత్ర వంటి పథకాలు చేనేత కార్మిక కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. 2017లో రాష్ట్ర ప్రభుత్వం థ్రిఫ్ట్ పథకాన్ని ప్రారంభించగా.. జిల్లాలోని పోచంపల్లిలో ‘నేతన్నకు చేయూత’ పేరుతో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి నెలా 8 శాతం పొదుపు చేసిన కార్మికుడి ఖాతాలో 16శాతం వాటా ధనంగా ప్రభుత్వం మూడేండ్ల వ్యవధి ముగిశాక అందజేస్తోంది. గత యేడాది కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘చేనేతకు చేయూత’ పేరుతో జిల్లాలోని 5,400 మంది కార్మికులకు రూ.33 కోట్ల వరకు పొదుపు నగదును అందజేసింది. అలాగే పేరుకుపోయిన వస్త్ర నిల్వలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. అయితే గత ఏడాది లాక్డౌన్లో ‘చేనేతకు చేయూత’ పథకం కార్మికులకు అండగా నిలవడంతో.. ఈ ఏడాది కూడా ఆ పథకాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో కార్మికులు కనిష్ఠంగా రూ.200 నుంచి రూ.1 500 వరకు పొదుపు చేసేందుకు అవకాశం ఉంది. పథకం కొనసాగింపుకు సంబంధించిన రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ప్రభుత్వం నుంచి వెలువడనున్నాయి.
నూలు కొనుగోళ్ల పైన 40 శాతం సబ్సిడీ
చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 40 శాతం
సబ్సిడీ ఇచ్చి ‘చేనేత మిత్ర’ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇందులో 35 శాతం కార్మికులు చెల్లిస్తుండగా.. మిగతా 5 శాతం సబ్సిడీని సంఘానికి లేకుంటే గ్రూపు లీడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌డీసీ) సంస్థలో గానీ, ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్న డిపోల్లో గానీ కొనుగోలు చేసిన నూలుకు ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తోంది. జనగామ, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న డిపోల్లో కార్మికులు ఎక్కువగా నూలును కొనుగోలు చేస్తున్నారు. 2018 జూన్‌లో ప్రారంభమైన ఈ పథకంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 6 వేల మంది రూ.3.86కోట్ల వరకు లబ్ధిపొందారు. సిల్క్‌కు సంబంధించిన నూలు కొనుగోళ్లపై ఏడాదిలో 9 సార్లు, కాటన్‌పై 12 సార్లు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ లెక్కన మగ్గంనేసే నేత నెలకు రూ.4-5వేలను, అనుబంధ కార్మికుడు రూ.1-2వేల వరకు లబ్ధిపొందవచ్చు. జిల్లాలో 1,691 బిల్లులకు గాను రూ.4.11కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు 1,601 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చి కార్మికుల ఖాతాలో రూ.3.86కోట్లను జమచేసింది. ఇంకా కొద్దిపాటిగా మిగిలిపోయిన చెల్లింపులు జరిపితే అనుకున్న లక్ష్యం నెరవేరినట్లేనని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
8వేల మందికి పైగా లబ్ధి
జిల్లాలో 20వేల వరకు చేనేత కుటుంబాలు మగ్గాలనే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నాయి. చేనేత, జౌళీశాఖ అధికారుల సర్వే ప్రకారం.. జియో ట్యాగింగ్‌లో 5,890 మగ్గాలు ఉండగా..5 వేల మంది ఈ పథకంలో చేరారు. ఇప్పటివరకు యాభై శాతం మందే ‘థ్రిఫ్ట్’ పథకంలో లబ్ధిపొందుతున్నారు. వివిధ కారణాల వల్ల ఈ పథకంలో లబ్ధిదారులు చేరలేకపోయారు. ఫలితంగా ప్రభుత్వం అందించే సాయాన్ని ఎన్నో కుటుంబాలు పొందలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చేనేత, జౌళీ శాఖ జిల్లా వ్యాప్తంగా ఏ ఏడాది ఆరంభంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి కొత్తగా 900 మంది వివరాలను సేకరించారు. ఈ లెక్కన మరమగ్గాల కార్మికుల తో పాటు అనుబంధ కార్మికులు కలుపుకుని జిల్లాలో ‘థ్రిఫ్ట్’ పథకం కింద లబ్ధిపొందే వారి సంఖ్య 8వేలకు పైగా చేరే అవకాశం ఉంది. జియోట్యాగ్ కలిగిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు ఎప్పటికప్పుడు గుర్తించి ఈ పథకంలో మరింతమంది లబ్ధిపొందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విధివిధానాలు వచ్చిన వెంటనే అమలుకు చర్యలు
కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అమలుచేస్తున్న థ్రిఫ్ట్, చేనేత మిత్ర పథకాలు చేనేత కార్మిక కుటుంబాలకు గొప్ప మేలును చేకూర్చుతున్నాయి. చేనేత మిత్ర పథకంలో ప్రతి నెలా కొంత స్థిర ఆదాయం కార్మికులకు సమకూరుతుంది. థ్రిఫ్ట్ పథకం కొనసాగింపునకు సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం నుంచి రానున్నాయి. ఆ వెనువెంటనే పథకం అమలుకు చర్యలు తీసుకుంటాం. నూరుశాతం మంది కార్మికులకు ఈ పథకంలో లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నాం.
చేనేత కార్మికులకు సన్మానం
ఆలేరు టౌన్, ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆలేరు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ సర్పంచ్ చింతకింది మురళి, మాజీ ఉప సర్పంచ్ దాసి సంతోష్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, కౌన్సిలర్ బేతి రాములు, మాజీ ఎంపీటీసీ బింగి రవి, నాయకులు గుజ్జ అశోక్, చింతకింది రామాంజనేయులు, రేగోటి వెంకటేశ్, రచ్చ సత్యనారాయణ, సంతోష్, కాముని రవి, బేతి వెంకటేశ్ పాల్గొన్నారు.
పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో..
మోత్కూరు,ఆగస్టు7: పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మార్కండేయ స్వామి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధ చేనేత కార్మికులు పోచం లక్ష్మీనర్సయ్య, పోచం నర్సయ్య, వేముల సత్తయ్య పోచం విమల, కసూర్తి మధురమ్మను సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు పోచం భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోచం కన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గంగుల రాములు, వంగరి రాములు , జిల్లా రవీందర్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లిలో..
భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 7: టీఆర్ఎస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీ శ్రీనివాస్ కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. మరోవైపు పద్మశాలీ చేనేత కార్మిక ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సీనియర్ చేనేత కార్మికులను సత్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, సీత వెంకటేశం, చింతకింది కిరణ్‌కుమార్, అంకం పాండు, సీత శ్రవణ్, రుద్ర శ్రీశైలం, మురళి, శశికళ పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట, ఆగస్టు 7 : మండలంలోని రఘునాథపురం, రాజాపేట గ్రామాల్లో కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.నాయకులు జనార్దన్, నారాయణ, పద్మశాలీ సంఘం నేతలు పాల్గొన్నారు.
చేనేత కార్మికులను ఆదుకోవాలి
వలిగొండ, ఆగస్టు 7: చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ అన్నారు. మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకున్నారు. తౌటం నరహరి, దొంత శంకరయ్య, అయిటిపాముల రవి, సాయిని యాదగిరి, నరసింహ, నరహరి, భూమయ్య పాల్గొన్నారు.
చేనేత కార్మికులు స్వయంశక్తితో ఎదగాలి
కలెక్టర్ పమేలాసత్పతి
భువనగిరి అర్బన్, ఆగస్టు 7: చేనేత కార్మికులు స్వయంశక్తితోఎదగాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వర్తక సంఘం ఆవరణలో చేనేత సంఘం ర్యాలీని ఆమె జెండాఊపి ప్రారంభించారు. అనంతరం చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత కార్మికులు కేవలం పనిచేసేవారు మాత్రమే కాదని, వారు అద్భుతాలు సృష్టించే సృష్టికర్తలన్నారు. చేనేత కార్మికులు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు ఉపయోగపడే విధంగా ప్రోత్సహించాలన్నారు.చేనేత వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. కేవలం మార్కెటింగ్ సౌకర్యాలు లేవనే భావన విడనాడి తనలోని ప్రతిభకు పదునుపెట్టాలన్నారు. మరిన్ని లాభాలు రావాలంటే ఆన్లైన్లో మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తరించుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులకు చేనేత వస్ర్తాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం అధికారులు విధిగా చేనేత వస్ర్తాలు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి మెమోంటో, ప్రశంసాపత్రాలతో పాటు సత్కరించారు. అదే విధంగా రూ.5 కోట్ల లక్ష విలువగల చెక్కును చేనేత మిత్ర పథకం కింద 9 వేల మంది లబ్ధిదారులకు (నూతన సబ్సిడీ కింద) అందజేశారు. పావలా వడ్డీ పథకం కింద 10 సంఘాలకు రూ.22,44,000లక్షల చెక్కు, ఆత్మహత్య చేసుకున్న 25 మంది చేనేత కుటుంబాలకు రూ.5,016 వేల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం, వివిధ చేనేత సంఘాల చైర్మన్లు, పాల్గొన్నారు.
మంత్రులను కలిసిన టీఆర్ఎస్ నాయకులు
చౌటుప్పల్, ఆగస్టు7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని హైదరాబాద్‌లో టీఆర్ఎస్ చౌటుప్పల్ నాయకులు శనివారం కలిసి పూలమాల,శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, ఆర్టీఏ జిల్లా మెంబర్ తడక చంద్రకిరణ్, నాయకులు దబ్బాక శశిధర్‌రెడ్డి, ముటుకుల్లోజు రాఘవ పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం
ఆత్మకూరు(ఎం), ఆగస్టు7: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ మండల నాయకుడు గడ్డం దశరథగౌడ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలో చేనేత కార్మికులు నర్సింహ, బుచ్చిరాములు, కృష్ణమూర్తి, సుదర్శన్, దేవదాస్‌ను సన్మానించి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బూడిద శేఖర్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాతి మల్లికార్జున్, సతీశ్, నవీన్ పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చౌటుప్పల్, ఆగస్టు7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలో లయన్స్‌క్లబ్ సభ్యులు చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, ప్రశాంత్, కరుణాకర్ పాల్గొన్నారు.
చేనేత కార్మికుల ర్యాలీ
రామన్నపేట, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు భరోసా కల్పిస్తుందని జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, పద్మశాలీసంఘం పట్టణ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, కె. నాగభూషణం, సూరపల్లి యాదగిరి, సుదర్శన్, వనం హర్షిణి, జెల్ల వెంకటేశం, పున్న వెంకటేశం, వనం విఠల్, శ్రీనివాస్, అశోక్, సత్యనారాయణ పాల్గొన్నారు.