Vijay -Rashmika | టాలీవుడ్లో అత్యంత పాపులర్ జంటలలో ఒకటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్నాయి. కలిసి పలు సినిమాల్లో నటించిన తర్వాత వీరి మధ్య సన్నిహిత్యం పెరిగిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని ఫ్యాన్స్ నమ్మకం. ఇటీవల వీరిద్దరూ సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ జంట పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం విజయ్ – రష్మిక వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్రైవేట్ ప్యాలెస్‌లో జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, పెళ్లి కోసం ప్రత్యేకంగా గ్యాప్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా కానీ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి ఫోటోలు ఎప్పుడొస్తాయా అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక వివాహం అనంతరం మార్చ్ 4న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు కూడా ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ – రష్మిక జంట ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించి మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాల తర్వాత వీరి ఆన్‌స్క్రీన్ జోడీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం మరోసారి ఈ జంట ‘రణబలి’ అనే ప్రాజెక్ట్‌లో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం వీరి వివాహం గురించి ఊహాగానాలు ఆగడం లేదు. నిజంగా ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుందా? లేక ఇది కేవలం రూమరేనా? అన్నది అధికారిక క్లారిటీ వచ్చిన తర్వాతే తేలాల్సి ఉంది.