
యాదాద్రి భువనగిరి, జూలై 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గతంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. మురుగునీటి కాల్వలను ఎప్పుడోకాని శుభ్రం చేసేవారు కాదు. స్తంభాలకు దసరాకు లైట్లు వేస్తే.. మళ్లీ దసరాకే మోక్షం. కానీ..సీఎం కేసీఆర్ చేపట్టిన ‘పల్లె ప్రగతి’ అనే కార్యక్రమం..పల్లెల రూపురేఖలనే మార్చివేసింది. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు లు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలు, ట్రాలీ ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్లు.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒనగూరాయి. ఎక్కడ చూసినా..పచ్చని పల్లెలు దర్శనమిస్తున్నా యి. పరిశుభ్రమైన వీధులు స్వాగతం పలుకుతున్నాయి. వేలాడే విద్యుత్ లైన్ల స్థానంలో ఎల్ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ప్రతిపల్లెలోనూ అభివృద్ధి సంబురంలా సాగుతున్నది.’
ఓ వైపు ఆదాయం.. మరోవైపు ఉపాధి
జిల్లాలోని ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్లను ప్రభుత్వం నిర్మించింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరుచేసి కంపోస్టు షెడ్లలో సేంద్రి య ఎరువులను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఇది గ్రామాల్లో నాటిన మొక్కలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. సేంద్రియ ఎరువుల విక్రయాల ద్వారా మున్ముందు పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరనున్నది. ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో కూలీలకు ఉపాధి అవకాశాలు కలిగాయి. ప్రభుత్వం కొంత నిధులను సామగ్రి కింద వ్యయం చేస్తుండగా.. కూలీలకు వేతనాలు అందించి ప్రకృతి వనాల పెంపకాన్ని చేపడుతోంది. దీంతో ఉన్న ఊర్లోనే కూలీలకు పని దొరికినైట్లెంది.
అన్ని పంచాయతీల్లో పనులు చేపట్టేందుకు చర్యలు
సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సగానికి పైగా ఆవాసాలు రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మండలంలోని కందిబాయితండా, గ్నగమోళ్లతండా, పల్లగట్టుతండా, పుర్లగడ్డతండా, రాచకొండ, తుంబావితండా, వాచ్యతండా పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులను చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆలేరు మండలంలోని కందిగడ్డతండా, అడ్డగూడూరు మండలంలోని మనాయ్కుంట, మోత్కూరు మండలంలోని రావిబావి, తుర్కపల్లి మండలంలోని బాలునాయక్తండా, మోతీరాంతండా, రామోజినాయక్ తండాల్లో ప్రభుత్వ భూములు లేక ఈ పంచాయతీల్లో వైకుంఠధామాలు, వర్మీకంపోస్టు యార్డుల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. బస్వాపూర్(నృసింహ) రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపూర్, లప్పనాయక్‌తండా పంచాయతీల్లోనూ పనులను ప్రారంభించలేని పరిస్థితి. అయితే స్థానిక సమస్యలను అధిగమించి అన్ని పంచాయతీల్లోనూ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభంకాగా..మిగతా చోట్ల ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వైకుంఠధామాలు
పరిశుభ్ర పల్లెలుగా తీర్చిదిద్దేందుకు చెత్త సేకరణకోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ను సమకూర్చింది. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు చేపట్టింది. తడి చెత్తను కంపోస్ట్ యూనిట్‌కు తరలించి సేంద్రియఎరువును తయారుచేసేలా చర్యలు చేపట్టింది. 421 పంచాయతీలకుగాను ఇప్పటివరకు 418 చోట్ల డంపింగ్ యార్డులు, 387 చోట్ల కంపోస్ట్ షెడ్లు అందుబాటులోకి వచ్చాయి.
డంపింగ్ యార్డులు
గ్రామంలో ఎవరైనా చనిపోతే శివారులోని బహిరంగ ప్రదేశాలు, పొలాల వద్దనే అంత్యక్రియలు ని ర్వహించుకోవాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులను తీ ర్చి ఆత్మీయ వీడ్కోలును గౌరవంగా నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రతి గ్రామంలో అన్ని హంగుల తో కూడిన వైకుంఠధామాల నిర్మిస్తోంది. జిల్లాలో 421 పంచాయతీలకుగాను ఇప్పటివరకు 379 పంచాయతీల్లో నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి.
రైతు వేదిక…
రైతులను సంఘటితం చేసే ఆలోచనలో భాగంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో జిల్లాలో ఒక్కో రైతు వేదికకు రూ. 22 లక్షలు ఖర్చుచేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో 92 రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించగా… దాదాపు అన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల దశల వారీగా ప్రారంభాలు కూడా మొదలయ్యాయి.
పల్లె ప్రకృతి వనాలు
పల్లెవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఆవాసంలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
వాకింగ్ ట్రాక్ వంటి హంగులను సైతం కల్పించారు. 421 పంచాయతీలతోపాటు వాటి పరిధిలోని 229 ఆవాసాలు కలుపుకుని మొత్తం 650 ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టగా..635 వనాలు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి.