మున్సిపల్ ఎన్నికల ఘట్టం తుదిదశకు చేరింది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులకు అధికారులు ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. మెజార్టీ సభ్యులు చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా ఎన్నికను చేపట్టనున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ప్రత్యేక సమావేశం జరిగే కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
– ఖమ్మం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులు, ఒక కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు సోమవారం భర్తీకానున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. చివరి నిమిషం వరకు తమ పేరును పరిశీలించాల్సిందిగా ఆశావహులంతా పార్టీ నేతలపై ఒత్తిడి పెంచారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అనేకమంది ఆశిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ల ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకుగాను ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఒక్కో మున్సిపాలిటీకి ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరిని విప్‌గా నియమించింది. పార్టీ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు, కౌన్సిలర్లు, కొత్తగూడెం కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఓటువేసే విధంగా ప్రణాళికను రూపొందించారు.
చైర్మన్, వైస్ చైర్మన్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక కంటే ముందు కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో అధికారులు ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులకు అధికారులు ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్, ఏదులాపురం, వైరా, మధిర, సత్తుపల్లి, కల్లూరు, అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో అధికారులు ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తారు. సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారు. చైర్మన్ అభర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను మెజార్టీ సభ్యులు చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా బలపర్చాలి. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది.
కొత్తగూడెం మేయర్‌గా గణేశ్!
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా సీపీఐ నుంచి విజయం సాధించిన మూడు గణేశ్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్‌కు అవకాశం రావడంతో అనేకమంది ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఐదు మున్సిపాలిటీలకు ఐదుగురు విప్‌లను నియమించింది. సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీలకు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, మధిరకు కోనా మణికుమార్, కల్లూరుకు పొంగులేటి ప్రసాదరెడ్డి, ఏదులాపురానికి తుంబూరి దయాకర్‌రెడ్డిని పార్టీ నియమించింది. ఏదులాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ‘ఏ ప్రాతిపదికన ఎవరిని చైర్‌పర్సన్‌గా పీఠం ఎక్కిస్తారా?’ అనేది ఆసక్తికరంగా మారింది. సత్తుపల్లి, వైరాలో ఆయా శాసనసభ్యులు సూచించిన వారికే చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్లూరు మున్సిపాలిటీ జనరల్ కాగా, మహిళను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 15: ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఖమ్మం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీతో కలిసి ఆదివారం పరిశీలించారు.