హరిత తెలంగాణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అటవీ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. యాదాద్రి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ స్థాయి యాత్రా స్థలంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో మరింత శ్రద్ధ కనబరుస్తున్నది. ఆ మేరకు అటవీ శాఖ సైతం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నది. యాదాద్రి ఆలయానికి వెళ్లే దారిలో రాయగిరి వద్ద ఏర్పాటుచేసిన నారసింహ, ఆంజనేయ అభయారణ్యాలు ఇప్పటికే దట్టంగా కనిపిస్తూ.. పర్యాటకుల
మది దోచుకుంటున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద తంగేడు వనం చిట్టడవిలా రూపుదిద్దుకుని ఆహ్లాదం పంచుతున్నది. చుట్టూ కొండలు.. ఏపుగా పెరిగిన చెట్లు, జలపాతాలు. ఎటుచూసినా పచ్చిక బయళ్లు.. వెరసి కాలు మోపడంతోనే అడవుల్లో విహారానికి వెళ్లిన అనుభూతిని అర్బన్ ఫారెస్ట్లు అందిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కనుచూపు మేరలో ఎత్తయిన కొండలు.. మనస్సును ఆహ్లాదపరిచే వాతావరణం.. అచ్చంగా అటవీ జంతువులను తలపించే ప్రతిమలు.. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఎత్తయిన గుట్టలపై ఏర్పాటు చేసిన పగోడాలు.. పచ్చని బయళ్లు.. ఇలా సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్న అర్బన్ ఫారెస్టు పార్కులు.. దట్టమైన అడవుల్లో పర్యటించిన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఒక్కో పార్కుకు ఓ ప్రత్యేక ఉండేలా.. చిన్నాపెద్ద అందరినీ అబ్బురపరిచేలా అభయారణ్యాలు ఉన్న చోట.. అర్బన్ పార్కులుగా తీర్చిదిద్ది అటవీ శాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. సాయం సంధ్యవేళల్లో.. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సేదతీరేలా ఈ పార్కుల్లో అనేక సౌకర్యాలు కల్పించారు. ఎంజాయ్ కోసం.. నగరాలకు పరుగులు తీసే అవసరం లేకుండా.. మనకు చేరువలోని పలు అటవీ ప్రాంతాలు ఆహ్లాదకర ఉద్యానాలుగా అందరినీ అలరిస్తున్నాయి. యోగా.. వాకింగ్ ట్రాక్లతో ఆరోగ్యానికి ఉపయోగపడే వనరులతోపాటు.. చిన్నపిల్లలను మంత్రముగ్ధులను చేసే ఎన్నో ఏర్పాట్లు ఇక్కడి పార్కుల్లో ఉన్నాయి. నామమాత్రపు ప్రవేశ రుసుము తప్ప ఖర్చు లేకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన తంగేడు వనం, నారసింహ, ఆంజనేయ అభయారణ్యాలకు ఆదరణ పెరుగుతున్నది.
యాదాద్రి వెళ్లే దారిలో.. చూడచక్కని చిట్టడవులు
సహజ సిద్ధమైన ఎన్నో అందాలతో పర్యాటకులను కట్టిపడేసేలా నారసింహ, ఆంజనేయ అభయరణ్యాలను తీర్చిదిద్దారు. రకరకాల చెట్లు, పూల మొక్కలు, నీటితో కళకళలాడే చెక్ డ్యామ్లు, ప్రకృతిలో విహరించేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్లను నిర్మించారు. ఎత్తైన గుట్టలపై నుంచి ప్రకృతి అందాలను తిలకించేందుకు వీలుగా ఈ రెండు పార్కుల పరిధిలో 8 వరకు పగోడాలను నిర్మించారు. యాదాద్రి ఆలయానికి వెళ్లే దారిలో రాయగిరి వద్ద వీటిని అటవీశాఖ ఏర్పాటు చేసింది. రాయగిరి-1 రిజర్వ్ ఫారెస్టులో రూ.2.83కోట్ల వ్యయంతో 56.65 హెక్టార్ల విస్తీర్ణంలో ఆంజనేయ అరణ్యాన్ని, రాయగిరి-2 రిజర్వ్ ఫారెస్టులో 97.12 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.61కోట్ల వ్యయంతో నారసింహ అరణ్యాన్ని అభివృద్ధి చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన జంతువుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పులి గాండ్రించినట్లుగా.. లేడి పరుగులు పెట్టినట్లుగా.. నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన జంతువుల ప్రతిమలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట పట్టణం వరకు రోడ్డు మధ్యలో, రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన రకరకాల మొక్కలు.. పచ్చని గార్డెన్ ఇక్కడకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
కార్యాలయాలకు పచ్చని నీడ
తిరుమలగిరి, అక్టోబర్ 4 : తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు హరితహారం చెట్లతో కళకళలాడుతున్నాయి. మండల పరిషత్, వెలుగు, తాసీల్దార కార్యాలయాల్లో మూడో విడుత హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో వేప, టేకు, రావి, సుబాబుల్ మొక్కలు నాటగా అవి పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. పనినిమిత్తం వచ్చే ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ప్రధాన రోడ్లుకు ఇరువైపులా పెరిగిన చెట్లు ప్రయాణికులకు నీడనిస్తున్నాయి.
మంచి ఫలితాలు..
వానలు వాపస్ రావాలి, కోతులు అడవికి తిరిగి వెళ్లాలి అనే నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆకాంక్షకనుగుణంగా హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటడం అద్భుతమైనది. ప్రతియేటా నాటిన మొక్కలతో నేడు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు రోడ్ల వెంట పెరిగిన చెట్లు పచ్చదనాన్ని పంచుతున్నాయి.