
తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా, సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్మాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తికాగా, మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చుట్టూ పచ్చదనం, కళా నైపుణ్యం, ఆధ్యాత్మిక వైభవంతో అపర వైకుంఠాన్ని తలపిస్తున్న యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభం ఎప్పుడెప్పుడాని భక్తకోటి వేయి కన్నులతో ఎదురుచూస్తుండగా, మూలవర్యుల దర్శనభాగ్యం కల్పించే శుభఘడియల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్.. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ముహూర్తం ఉండొచ్చని ఢిల్లీ పర్యటనలో ప్రకటించారు. సీఎం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాన మంత్రి మోదీ సుముఖత తెలుపడంతో యాదాద్రి వైభవం మరోమారు అంతటా ప్రస్తావనకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలయ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నయో తెలిపే కథనమిది.
‘అద్భుతః’ అనిపించేలా సప్త గోపురాలు.. ధార్మిక సాహిత్యం, కళలు ఉట్టిపడేలా ప్రాకారాలు… బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ముఖ మండపం.. అడుగడుగునా
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కృష్ణ శిలా సౌదర్యం.. ఒక్కటేమిటి..! ఆద్యంతం భక్తి పారవశ్యంలో ఓలలాడించే కట్టడాలతో యాదాద్రి నారసింహుడి క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ప్రతి నిర్మాణంలోనూ ఓ విశిష్టత ఉట్టిపడేలా పనులను చేపట్టారు. ‘నఃభూతో నఃభవిష్యత్’ అన్న రీతిలో
ప్రధానాలయం పనులు పూర్తయ్యాయి. యాదాద్రీశుడి ఖ్యాతి, విశిష్టతను ఖండాంతరాలకు చాటడంతోపాటు వర్తమాన, భావితరాలూ సంబురపడేలా 4.35 ఎకరాల్లో దివ్యక్షేత్రం సువిశాలంగా రూపాంతరం చెందింది. ప్రధానాలయం నూరు శాతం పూర్తవ్వగా.. వసతులు, సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడక్కడా మిగిలి ఉన్న చిన్న, చిన్న పనులను ముగించుకుని త్వరలోనే స్వామివారి
మూలవరుల దర్శనభాగ్యం కలిగించబోతుండడంతో ఆ క్షణాలను తలచుకుని
భక్తజనం సంతోషం వ్యక్తం చేస్తున్నది
ఐదేండ్ల మహా యజ్ఞం…
ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. భక్త జనావళికి కనువిందు గొలిపేలా యాదాద్రీశుడి ఆలయాన్ని ప్రపంచస్థాయి క్షేత్రంగా శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీవైష్ణవ ఆచార్యులైన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్తపతులు కార్యరూపంలోకి తీసుకొచ్చారు. పాంచరాత్ర ఆగమ, సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. రూ.1,200కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11న ప్రారంభమైన పనులు ఐదేండ్లలోనే పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన పనులకు రూ.850కోట్ల దాకా వెచ్చించారు. ఆధారశిల నుంచి గోపురం పై వరకూ పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం యాదాద్రి ఆలయ విశేషం. కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి అత్యద్భుతంగా రూపుదిద్దుకున్నది. ఆలయం పసిడి కాంతిని వెదజల్లేలా బెంగుళూరుకు చెందిన నిపుణులతో లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
సర్వ హంగులు..
కొండపై క్యూ కాంప్లెక్స్ పక్కనే రూ.5.3కోట్ల వ్యయంతో విష్ణు పుష్కరిణి నిర్మాణం పూర్తయ్యింది. కొండ కింద 2.20ఎకరాల్లో రూ.11.55 కోట్లతో లక్ష్మీ
పుష్కరిణి(గండి చెరువు)
పనులు జరుగుతున్నాయి. ఆ పక్కనే రూ.8.90 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న దీక్షాపరుల మండపం పనులు పురోగతిలో ఉన్నాయి. 2.33ఎకరాల స్థలంలో రూ. 20.25 కోట్ల వ్యయంతో చేపట్టిన కల్యాణకట్ట పనులు పూర్తికాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఒక్క బ్యాచ్‌లో 700మంది చొప్పున రోజుకు లక్షమందికి భోజనం అందించేలా అధునాతన అన్న ప్రసాదాల మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి. మూడు అంతస్తుల్లో ప్రసాద విక్రయ కార్యాలయం ముస్తాబవుతోంది.
గండి చెరువు సమీపంలో ఏకకాలంలో 500 మంది వ్రతాలు చేసుకునేలా విశాలమైన రెండు హాళ్లను నిర్మిస్తున్నారు. అవకాశం ఉంటుంది.
సకల సదుపాయాలు…
ఆలయ ప్రారంభోత్సవం తర్వాత దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు యాదాద్రిని సందర్శించనుండడంతో ఏ ఒక్కరికీ ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కేసీఆర్ ముందు చూపుతో అన్ని సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
యాదాద్రి కొండపైన లిఫ్ట్ నిర్మాణంతోపాటు, ఈఓ కార్యాలయాలు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి ముఖ్యులు బసచేసేందుకు ప్రధానాలయానికి ఉత్తరాన 13ఎకరాల గుట్టపై రూ.104కోట్ల వ్యయంతో ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇతర వీఐపీల బసకు నిర్మిస్తున్న 14విల్లాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.
ప్రధానాలయం కొండ చుట్టూ రూ.120కోట్లతో 5.7కి.మీ. మేర బాహ్యవలయ రహదారి సిద్ధమైంది. రాయగిరి నుంచి యాదాద్రి, యాదాద్రి నుంచి రాజాపేట, కొమురవెల్లి, తుర్కపల్లి మీదుగా కీసర వరకు రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మూడు సర్కిళ్ల పనులు సైతం పూర్తికావొస్తున్నాయి. రాయగిరి నుంచి గుట్ట వరకు రూ.100కోట్లతో రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన పచ్చదనం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
భక్తులు, విదేశీ యాత్రికులు బస చేయడానికి పెద్దగుట్టపై ఉన్న టెంపుల్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో విల్లాలు, కాటేజీల నిర్మాణాలకు కసరత్తు జరుగుతున్నది. భక్తుల వసతి ఏర్పాట్ల కోసం వెయ్యి ఎకరాల పెద్ద గుట్టపై మొదటి దశలో 250ఎకరాల్లో రూ.207కోట్ల వ్యయంతో ఆహ్లాద వాతావరణం నెలకొనేలా టెంపుల్ సిటీని అభివృద్ధి చేశారు. డోనర్ పాలసీని రూపొందించి ఇందులో 250కాటేజీలను నిర్మించనున్నారు. టెంపుల్ సిటీలోనే నిర్మిస్తున్న వైటీడీఏ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తికావొస్తున్నాయి.