అమరావతి : మసీదుకు చెందిన భూమిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు ( ACB ) రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏపీలోని కడప జిల్లా పులివెందుల( Pulivendula ) ఆర్డీవో కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న నాగేంద్రప్రసాద్ రూ.10 వేలు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు.
చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామంలో మసీదుకు చెందిన 36 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని మసీదు కమిటీ సభ్యులు అధికారులను సంప్రదించడంతో డీటీ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు కరీముల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో నాగేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.