Arjun | దక్షిణాది చిత్రసీమలో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అర్జున్ సర్జా నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. దేశభక్తి, కుటుంబ విలువలు, యాక్షన్ అంశాలను కలగలిపిన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన, ఇప్పుడు మరో భావోద్వేగభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సీతా పయనం’ ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ను టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో నిరంజన్ హీరోగా నటించగా, అర్జున్ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక పాత్రలో ధ్రువ సర్జా కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ప్రేమకథలా కనిపించినా, ఇందులో కుటుంబ బంధాలు, దేశభక్తి, మానవీయ విలువలు ప్రధాన అంశాలుగా ఉంటాయని అర్జున్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ కథకు మూల ఆలోచన పదమూడు సంవత్సరాల క్రితమే వచ్చిందని, అప్పటినుంచే దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చానని వెల్లడించారు. తన కూతురిని మంచి కథతోనే పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు పేర్కొన్నారు. “కొడుకులే కాదు, కూతుర్లు కూడా వారసులే” అనే భావనతో ఐశ్వర్యను సినిమాల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. నిర్మాతగా వ్యవహరించడం వల్ల ఖర్చుల నియంత్రణతో పాటు సృజనాత్మక స్వేచ్ఛ కూడా లభిస్తుందని వివరించారు.
మొదట ఈ కథను విశ్వక్ సేన్‌తో చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యంకాలేదని తెలిపారు. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కథలో ఒక్క సన్నివేశం కూడా మార్చలేదని, నిరంజన్‌కు సరిపోయేలా అదే కథను తెరకెక్కించామని చెప్పారు. సెన్సార్ ప్రక్రియలో ఎలాంటి కత్తిరింపులు లేకుండా U సర్టిఫికేట్ లభించిందని వెల్లడించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని తెలిపారు. తన పాత చిత్రాలు జెంటిల్మన్ రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశం కూడా ఉందని, సరైన కథ దొరికితే హనుమాన్ జంక్షన్ తరహా ప్రాజెక్ట్‌లపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. సినిమా ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ గురించి కూడా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కువసార్లు కలవకపోయినా ఆహ్వానం అందుకున్న వెంటనే కార్యక్రమానికి రావడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
కొద్దిసేపు మాత్రమే మాట్లాడదామని అనుకున్నా గంటల తరబడి చర్చ సాగిందని తెలిపారు. ఆయనలో కనిపించే నిజాయితీ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. తమ కుటుంబానికి పవన్‌పై ప్రత్యేక అభిమానం ఉందని, ముఖ్యంగా ఖుషి సినిమా సమయం నుంచి ఆ అభిమాన బంధం మరింత బలపడిందని చెప్పారు. అయితే రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని, నటన–దర్శకత్వ రంగాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు అర్జున్ స్పష్టం చేశారు.