
ఆలేరు టౌన్, మే 4 : వ్యవసాయంలో భూసార పరీక్షలది ప్రధానమైన పాత్ర. నేల స్వభావాన్ని బట్టి దిగుబడులు వస్తాయి. భూమిలో ఉన్న పోషకాలు ఏవి తక్కువగా ఉన్నాయో వాటిని అందించాలి. ఈ విషయాలను తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేసేందుకు ప్రయోగశాలలు అందుబాటులో ఉండాలి. ఇందుకుగాను రైతు వేదికలను వినియోగించనున్నారు. సాగులో సలహాలు, సూచనలు అందించడం, శిక్షణ కోసం సమావేశాలు నిర్వహించేందుకు జిల్లాలో 92 క్లస్టర్లుగా విభజించారు. 90 క్లస్టర్ల పరిధిలో రైతువేదిక భవనాలు నిర్మించారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో అన్ని టెక్నాలజీ హంగులతో కూడిన రైతు వేదిక భవనాలు నిర్మించారు. రైతుల వ్యవసాయ భూముల నాణ్యత, పోషక విలువల పరిశీలనకు నిర్దేశించిన భూసార పరీక్షలను అక్కడే నిర్వహించి ఫలితాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
వచ్చే వానకాలం కోసం నమూనాల సేకరణ చేపట్టి ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయి. భూసార పరీక్షల ఫలితాలతో రైతులకు మేలు జరుగనున్నది. భూసార పరీక్షలపై అవగాహన లేక ఎంతో మంది రైతులు ఇష్టానుసారంగా పురుగుమందులు, రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో పెట్టుబడులు పెరగడమే కాకుండా భూములు సారాన్ని కోల్పోతున్నాయి. రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారి, రైతు సంఘం ప్రతినిధికి ప్రభుత్వం వసతి సమకూర్చింది. రైతు సమావేశాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ముఖ్య వ్యవసాయాధికారులతో ప్రసంగాలు ఇప్పించాలని నిర్ణయించింది. కార్యాలయాలకు కుర్చీలు, టేబుళ్లు సమకూర్చింది. గతంలో వ్యవసాయశాఖ అధికారులు ఇబ్బందులు పడేవారు.
మట్టిలో సారాన్ని బట్టి పంటల సాగు
వచ్చే వానకాలం నుంచి రైతులు తమ పొలంలోని మట్టి ఫలితాల ఆధారంగానే పంటను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. మట్టి ఫలితాల్లో పొలంలోని పోషకాలు తెలుస్తాయి. ఈ పోషకాలు ఏయే పంటల సాగుకు అనుకూలమో తెలుస్తుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు పంటలను సిఫారసు చేస్తారు. అధికారులు సూచించిన వాటిలో ఏదో ఒక పంటను సాగు చేయాల్సి ఉంటుంది. రైతు సాగు చేసే పంట పేరు సైతం నమోదు చేస్తారు. ఆ పంటకు అవసరమైన రాయితీ విత్తనాలు, పంటకు అవసరమైన ఎరువులను గుర్తించి రైతు వారీగా నివేదికను రూపొందిస్తారు. అంతే కాకుండా వ్యవసాయశాఖలో ఏఈవో స్థాయి అధికారి కీలకం. రైతులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండడంతో పాటు నేల స్వభావం, పంటల దిగుబడులు అన్నింటిపై వారికి అవగాహన ఉంటుంది. భూసార పరీక్షలు నిర్వహించడంలో ఏఈవోల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అయితే భూసార పరీక్షలపై చాలా మంది రైతులకు అవగాహన ఉండదు. ఇష్టానుసారంగా మట్టిని సేకరిస్తున్నారు. భూసార పరీక్షలు నిర్వహించేందుకు సేకరించిన మట్టిలో తేమ ఉండకూడదు. నీడలో ఉన్న మట్టిని సేకరించకూడదు. సేంద్రియ, రసాయన ఎరువులు వేశాక మట్టి సేకరించవద్దు. భూమిలో 10సెం.మీ. నుంచి 15 సెం.మీటర్ల లోతును త్రిభుజా కారంలో గుంత తీసి పొరల నుంచి 500 గ్రాముల మట్టిని సేకరించాలి. ఆరబెట్టిన అనంతరం పరీక్షకు పంపాలి.