హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని, అందుకు తాజా ఫలితాలే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. ప్రభుత్వం అడుగడుగునా అరాచకాలు సృష్టించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా గులాబీశ్రేణులు వీరోచితంగా పోరాడారని, ఓటర్లు సైతం జంకకుండా బీఆర్ఎస్కు అండగా నిలిచారని కొనియాడారు. మున్సిపల్ ఫలితాలు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చెంపపెట్టు అని అభివర్ణించారు. ప్రజల ఆదరణతో కాంగ్రెస్‌ను గద్దె దించేది బీఆర్ఎస్సేనని తేల్చిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పార్టీకి అండగా నిలిచిన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, గులాబీశ్రేణులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సామదాన భేద దండోపాయాలు ప్రయోగించినా ప్రజల మనసును గెలవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవంగా పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికల్లోనైనా అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు ఎక్కువ మొగ్గుచూపుతారని గుర్తుచేశారు. కానీ ముఖ్యంగా ఇంకో రెండు, మూడేండ్లు అధికారంలో ఉండే అవకాశమున్నప్పడు మరీ ఎక్కువని, అధికార మార్పిడీ కోసం జరిగే ఎన్నిక కాదు అనే ఆలోచన ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రజల్లో కనిపిస్తున్నదని వివరించారు.
అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో ఇటీవలి పంచాయతీ, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలున్నాయని గుర్తుచేశారు. రెండేండ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40 శాతం పంచాయతీలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని, 4000 పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ ఫలితాలు సైతం అదేవిధంగా ఉన్నాయని వివరించారు. బీఆర్ఎస్పై అవాకులు చెవాకులు పేలిన వాళ్ల నోళ్లు మూతలుపడేలా మెరుగైన ఫలితాలు సాధించామని కేటీఆర్ వెల్లడించారు. 2020లో మొత్తంగా 130 మేయర్, చైర్ పర్సన్లకు ఎన్నికలు నిర్వహిస్తే అనాడు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా 122 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలిచిందని గుర్తుచేశారు.
నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచింది నాలుగు మున్సిపాలిటీలనేనని, బీజేపీ రెండు, ఎంఐఎం రెండు గెలిచాయని గుర్తుచేశారు. కానీ నేటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు ఎదురునిలిచి ప్రతిపక్ష బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ డబ్బు, మద్యం పంచి, అధికార దుర్వినియోగానికి, అనేక అరాచకాలకు పాల్పడిందని, అయినా ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటు వేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఇప్పటికే అనేక చోట్ల బేరసారాలకు తెరతీసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకుపోయేందుకు, పోలీసులను పంపించి బెదిరింపులకు దిగడం మొదలు పెట్టిందని, గెలిచిన వాళ్లను లాకునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలకు తలొగ్గేది లేదని, కొట్లాడుదామని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి బావమరిది కీలక పాత్రధారిగా, కింగ్ పిన్‌గా వ్యవహరించి సింగరేణిలో 6 వేల కోట్ల బొగ్గు కుంభకోణానికి పాల్పడ్డారని, ఆధారాలతో సహా తాము బయటపెట్టామని కేటీఆర్ వివరించారు. ఈ నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ తమతో కలిసి వచ్చిందని, ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా మున్సిపాలిటీని సైతం గెలుచుకున్నామని వివరించారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేసున్నాయని, కాబట్టి ఆ పార్టీలను నిరోధించేందుకు సీపీఐ కలిసి వస్తే వారినీ కలుపుకొన్నామని గుర్తుచేశారు. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదని, హంగ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయమై కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావుతో ఇప్పటికే మాట్లాడానని, వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చామని వెల్లడించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు సీపీఐతో కలిసి వస్తామని తెలిపినట్టు చెప్పారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం వాటా, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నదని, కాంగ్రెస్ కుంభకోణంలో బీజేపీకి భాగస్వామ్యం ఉన్నదని, ఆ రెండు జాతీయ పార్టీల దోపిడీని నిరోధించాల్సి ఉన్నదని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు సింగరేణి గొంతు కోస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘ఆధారాలతో బయటపెట్టినా సింగరేణి కుంభకోణంపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు ఉపేక్షిస్తున్నది? ఎందుకు రేవంత్ సర్కార్‌ను కాపాడుతున్నది? ఎందుకు అడ్డుకోలేకపోతున్నది?’ అని నిలదీశారు. ‘సీపీఐ నాయకత్వాన్ని అడుగుతున్నం. కాంగ్రెస్, బీజేపీని నిరోధించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే సీపీఐ కొత్తగూడెం కార్పొరేషన్‌ను తీసుకోదలిస్తే మేము మద్దతిస్తం’ అని కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో 123 చోట్ల ఎన్నికలు జరిగితే అందులో 30 చోట్ల హంగ్ వస్తున్నదని, బీఆర్ఎస్ 15 గెలిచిందని, మొత్తంగా 45 పోతే మిగతావి మాత్రమే కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ వివరించారు. హంగ్ వచ్చిన చోట ఏ వైఖరి అవలంబించాలనేది బీఆర్ఎస్ అధినేత, అధ్యక్షుడు కేసీఆర్‌ను సంప్రదించడంతోపాటు, స్థానిక నాయకత్వం మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇంకా రెండు రోజుల సమయుమున్న నేపథ్యంలో అనివిధాలుగా ఆలోచించి, స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఘాటుగా స్పందించారు.
అలా అనుకున్నవాళ్లను ఎందరినో చూశామని, అలాంటి పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని, ఎవరూ శాశ్వతం కాదని, అలా అనుకున్నవాళ్లంతా గాలికి కొట్టుకుపోయారని వివరించారు. మనది చాలా గొప్ప దేశమని, ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తకువ అంచనా వేసినవాళ్లే చాలా తెలివితకువ వాళ్లని, దేశంలో ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, తెలంగాణ సాధించిన కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడూ కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ఓటమి పాలయ్యారని ఉదహరించారు. రేవంత్ రెడ్డిలా విర్రవీగిన వాళ్లు చాలామంది వచ్చారు, పోయారని, కానీ దేశం, ప్రజల చైతన్యం అట్లే ఉన్నదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూపి తమకు తిరుగులేదని కూడా రేవంత్‌రెడ్డి మళ్లీ పోజులు కొడతారని విమర్శించారు. కానీ నిజంగా ప్రభుత్వంపై, వారిపై వారికి అంత నమ్మకముంటే, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
స్థానిక ఎన్నికలనేవి స్థానిక అంశాల ఆధారంగా కొనసాగుతాయని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికలు అందుకు భిన్నమైనవని, రాజీనామా చేసి వస్తే ప్రజలే చెప్తారని, 10 చోట్లా ఉప ఎన్నికలు వస్తే కచ్చితంగా బీఆర్ఎస్సే గెలుస్తుందనేందుకు ఇదే నిదర్శనమని వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము సఫలమయ్యామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై సర్కార్‌ను నిలదీయంతోపాటు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాన్ని సమర్థవంతంగా ఎండగడుతున్నామని వెల్లడించారు. బలహీన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడంలో అందరికంటే ఎక్కువగా ముందుండి పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీయేనని వివరించారు. పోరాడుతున్న తమకే ప్రజలు కూడా మద్దతిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఫలితాలు ప్రజల్లో వస్తున్న మార్పు, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదనేదానికి దర్పణం పడుతున్నాయని వివరించారు.
90 శాతం స్థానాలను గెలిస్తేనే అధికార పార్టీ ఎన్నికల్లో గెలిచినట్టని, లేదంటే అది గెలుపేకాదని స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానికంగానే కొట్లాడుతామని చెప్పామని గుర్తుచేశారు. తాము ఎక్కడా రాష్ట్ర వ్యాప్త ప్రచారాలను నిర్వహించలేదని తెలిపారు. అద్భుతమైన పరిపాలన ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాల్లో లోకల్ బాడీస్‌లో ప్రభుత్వానికి వన్ సైడ్‌గా ఫలితాలు వస్తాయని వివరించారు. కాంగ్రెస్ పాలన సరిగా లేదు కాబట్టే మున్సిపాలిటీల్లో ఇలాంటి ఫలితాలు వచ్చాయని చురకలంటించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, చిరుమల్ల రాకేశ్, కడారి స్వామి పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సామదాన భేద దండోపాయాలు ప్రయోగించినా, విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రజల మనసు గెలవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వాస్తవంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపుతారు. అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో ఇటీవలి పంచాయతీ, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినయి.
-కేటీఆర్
‘నేనే రాజు.. నేనే మంత్రి అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నడు. అట్లా అనుకున్నవాళ్లను ఎందరినో చూసినం. అలాంటి పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటాటు. ఎవరూ శాశ్వతం కాదు. అట్లా అనుకున్నవాళ్లంతా గాలికి కొట్టుకుపోయిండ్రు.
-కేటీఆర్
2020లో మొత్తంగా 130 మేయర్, చైర్పర్సన్లకు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ ప్రత్యక్షంగా 122 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలిచింది. నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచింది నాలుగు మున్సిపాలిటీలనే.. బీజేపీ రెండు, ఎంఐఎం రెండు గెలిచినయ్. నేటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు ఎదురునిలిచి ప్రతిపక్ష బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించి సత్తా చాటింది.
-కేటీఆర్
కాంగ్రెస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, నిర్బంధాలు విధించినా వెరవకుండా క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని కేటీఆర్ కొనియాడారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందనేందుకు, రాష్ట్రంలో ప్రధాన ప్రత్యమ్నాయం, ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్‌తో పోరాడగలిగేది, ఆ పార్టీని గద్దె దించే శక్తి, బీజేపీని నిరోధించగలిగే శక్తి కచ్చితంగా బీఆర్ఎస్కే ఉన్నదని తాజా ఫలితాలతో మరోసారి నిరూపితమైందని వివరించారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయని, ఎన్నో రకాల కుయుక్తులు పన్నినా తెలంగాణ సమాజం మాత్రం రాష్ర్టానికి బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిందని హర్షం వ్యక్తంచేశారు. అదే ఉత్సాహంతో హైదరాబాద్ కార్పొరేషన్ గానీ, మిగతా కార్పొరేషన్ వరంగల్, ఖమ్మంతోపాటు, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ముందుకు పోదామని వివరించారు. కాంగ్రెస్ దుర్మార్గాలు, అరాచకాలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు మద్దతుగా నిలిచిన ప్రజలకు, స్వల్ప తేడాతో ఓడిన పార్టీ అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ నిరాశ పడవద్దని, బేజారు కావద్దని భరోసా ఇచ్చారు.