మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు… ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్నా బీఆర్ఎస్ ఎదురొడ్డి నిలిచింది… హస్తం పార్టీకి కళ్లెం వేసింది. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధుల్లోని 13 మున్సిపాలిటీల్లో ఓటర్లు అధికార కాంగ్రెస్‌కు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్కు అండగా నిలిచారు. పదమూడు మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ కేవలం ఆరు మున్సిపాలిటీలను గెలుచుకున్నది. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా సభ నిర్వహించిన పరిగి నియోజకవర్గంలోని పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్.. కాంగ్రెస్‌కు ధీటుగా సమానమైన వార్డులను గెలుచుకుని ఝలక్ ఇచ్చింది. మొయినాబాద్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో ఓటర్లు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో అక్కడ హంగ్ అనివార్యం కానున్నది.అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ మున్సిపాలిటీలో పోలింగ్‌కు ముందే కాంగ్రెస్‌కు తత్వం బోధపడి బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవమైన అభ్యర్థిని బెదిరించి ముందుగానే కాంగ్రెస్‌లోకి గుంజుకున్నారు. ఇక… సంగారెడ్డి జిల్లాలో నగరానికి ఆనుకొని ఉన్న ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ హవా కొనసాగింది. ఐదుచోట్లా అధికార కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): సాంకేతికంగా శివారు ప్రాంతాలైనప్పటికీ హైదరాబాద్ మహా నగర ప్రభావం తీవ్రంగా ఉండే మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధుల్లో జరిగిన పుర పోరు అధికార కాంగ్రెస్‌కు చేదు ఫలితాలనే మిగిల్చింది. అధికారం ఉన్నాం కదా… అని భారీ ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు అధికారిక వ్యవస్థలి వాడుకొని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడుగడుగునా అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ హస్తం పార్టీకి ఆశించిన స్థాయిలో అనుకూల ఫలితాలు దక్కలేదు. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకునేందుకు అధికార కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకొని నిలిచిన గులాబీ శ్రేణులు చేసిన కృషి ఫలించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ చేయని ప్రయత్నమంటూ లేదనేది బహిరంగ రహస్యం.
ఈ ప్రాంతాలన్నీ రియల్ ఎస్టేట్ పరంగా విలువైన భూములు ఉన్న ఏరియాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బుల్ని పారించిందనేది సుస్పష్టం. తన సొంత నియోజకవర్గం ఉండటంతో పాటు నగర శివారు ప్రాంతాలు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి సమీక్షలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద నుంచి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఓటర్లను కూడా అభ్యర్థించారు. దీంతో ఏకపక్షంగా ఓటర్లు తమకు పట్టం కడతారని ఆశించిన కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది.
తొమ్మిది అసెంబ్లీ, ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఈ పదమూడు మున్సిపాలిటీలు ఉండగా… ఇందులో మేడ్చల్ మినహా కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన కాలె యాదయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల సహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులో సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ కూడా ఉంది. ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. అయినప్పటికీ వీటన్నింటినీ అధిగమించి బీఆర్ఎస్ అధికార పార్టీకి ధీటుగా నిలబడి మంచి ఫలితాలను సాధించడమే కాకుండా తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీకి ఎక్కడా స్పష్టమైన మెజార్టీ రాకుండా నిలువరించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మూడు చింతలపల్లిలో 24 వార్డుల్లో ఏకంగా పద్నాలుగు వార్డులను సొంతం చేసుకోగా.. అధికార కాంగ్రెస్ తొమ్మిది స్థానాలకు పరిమితమైంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గులాబీ పార్టీ పన్నెండు స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలవగా బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు ఏడు స్థానాలను కైవసం చేసుకున్నది.

బీజేపీ మూడు స్థానాలను సాధిస్తే స్వతంత్రులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ చైర్మన్‌గిరి కోసం పదకొండు స్థానాలు కావాల్సి ఉండటంతో హంగ్ అనివార్యం కానుంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తుండగా పార్లమెంటు పరిధిలో బీజేపీ ప్రాతినిథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడంతో పాటు దాడులు కూడా చేసింది. అయినా బీఆర్ఎస్ శ్రేణులు వాటికి వెరవకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడంతో ఓటర్లు స్పష్టమైన మెజార్టీని అందించారు.
హైదరాబాద్ మహా నగరం ప్రభావం అత్యధికంగా ఉండే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా… ఇందులో అధికార కాంగ్రెస్‌కు ధీటుగా బీఆర్ఎస్ ఫలితాలను సాధించింది. ఆరు స్థానాల్లో గులాబీ పార్టీ రెండుచోట్ల స్పష్టమైన మెజార్టీని సాధించింది. మరో మున్సిపాలిటీలోనూ మంచి ఫలితాలనే సాధించింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్కు ఓటర్లు అత్యధిక స్థానాలను కట్టబెట్టారు.
ఇక్కడ 24 వార్డులు ఉంటే ఏకంగా 13 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపును సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో గెలవగా… బీజేపీ రెండు చోట్ల మరో చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక… బీజేపీ ప్రభావం తీవ్రంగా ఉండటంతో పాటు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుర్తి అసెంబ్లీ, నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోకి వచ్చే ఆమన్‌గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. బీజేపీని ఆరు స్థానాలకు కట్టడి చేయడంతో పాటు కాంగ్రెస్‌ను కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఎనిమిది వార్డులను గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్‌ను సొంతం చేసుకుంది.
హైదరాబాద్ మహా నగరానికి ఆనుకొని ఉన్న మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డులు ఉంటే ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పది, బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవగా… ఏకంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇక్కడ హంగ్ అనివార్యమైంది. కాగా చేవెళ్ల, శంకర్పల్లి, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ దక్కింది. షాద్‌నగర్‌లో 28 వార్డులకుగాను కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ పోరాడి పదకొండు స్థానాలను దక్కించుకుంది.
వికారాబాద్ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. సీఎం సొంత నియోజకర్గమైన కొడంగల్, అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్‌తో పాటు మిగిలిన పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అధికార కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడి నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అధికార, ధన బలాన్ని ప్రదర్శించినా కీలకమైన పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పరిగి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
జిల్లాకు భారీ నిధులను ప్రకటించారు. అయినప్పటికీ ఆయన సభ జరిగిన ప్రదేశానికి ఆనుకొని ఉన్న వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. అంతేగాకుండా ఈ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటే బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. మరో రెండు స్థానాల్లో బీఆర్ఎస్కు చెందిన రెబల్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికార కాంగ్రెస్ కౌంటింగ్ కేంద్రం వద్దనే స్వతంత్ర అభ్యర్థులను బెదిరించి క్యాంపునకు తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నిలువరించిన బీఆర్ఎస్ శ్రేణులపైనా దాడులకు ప్రయత్నించారు.

ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఏకగ్రీవమైన బీఆర్ఎస్ అభ్యర్థిని బెదిరించి మరీ కాంగ్రెస్ పార్టీలోకి గుంజుకోవడం అధికార కాంగ్రెస్ ఆగడాలకు నిదర్శనం. ప్రజల నాడిని ముందుగానే గుర్తించింది కాబోలు… కాంగ్రెస్‌కు తత్వం బోధపడి బీఆర్ఎస్ నుంచి ఏకగీవ్రమైన అభ్యర్థిని బెదిరించి కాంగ్రెస్‌లోకి గుంజుకున్నది. వాస్తవానికి పోలింగ్‌కు ముందుగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో స్థానంలో ఏకగ్రీవంగా వార్డులను గెలుచుకున్నాయి. అనంతరం పోలింగు జరిగిన వార్డులకుగాను వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 16 స్థానాలను గెలుచుకోగా… బీఆర్ఎస్ పది స్థానాలను గెలుచుకుంది. ఏకగ్రీవంతో కలుపుకుంటే కాంగ్రెస్‌కు 17, బీఆర్ఎస్కు 11 స్థానాలు ఉన్నాయి. కానీ 34 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఛైర్మన్ స్థానం సొంతం చేసుకోవాలంటే 18 స్థానాలు కావాలి. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలుచుకున్న అభ్యర్థితో ఇప్పుడు కాంగ్రెస్ ఛైర్మన్గిరీని సొంతం చేసుకోనుంది. తాండూరులోనూ 36 వార్డులకుగాను బీఆర్ఎస్ 12 వార్డులు సాధించింది.
హైదరాబాద్ మహా నగరానికి ఆనుకొని ఉన్న సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జోరు స్పష్టంగా కనిపించింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఇస్నాపూర్‌లో 26వార్డులకు బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ పది స్థానాల్లో విజయం సాధించాయి. మరో నాలుగు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో బీఆర్ఎస్ సులువుగా చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకోనున్నది. ఇంద్రేశంలో 18 వార్డులకు బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలు గెలుచుకున్నది.
కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు స్థానాలు గెలవగా మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ దూకుడు కనిపించింది. జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. దీంతో ఇక్కడ హంగ్ అనివార్యం కానున్నది. ఇక గడ్డ పోతారంలో 18 వార్డులకుగాను బీఆర్ఎస్ ఏకంగా 14 వార్డులు సాధించి.. కాంగ్రెస్‌ను మూడు స్థానాలకే పరిమితం చేసింది. గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులు ఉంటే గులాబీ పార్టీ 15 వార్డులు సాధించి కాంగ్రెస్‌ను నాలుగు స్థానాలకే నిలువరించింది.