కొత్త కాపురం పెడుతున్న నవ దంపతుల్ని పాలూనీళ్లలా కలిసి ఉండమని పెద్దలు దీవిస్తారు. పాలూనీళ్ల బంధం ఇరిగిపోని అనుబంధం! పాలు, నీళ్లు .. ఏవి ఎక్కువ ఉన్నా, ఏవి తక్కువ ఉన్నా కనిపెట్టలేనంతగా కలిసి ఉంటాయి. అలాగే, దాంపత్యంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్నట్టు కాకుండా ఒకరికొకరు అన్నట్లుగా అన్యోన్యంగా బతకాలని పెద్దల ఆశ. ఈ దీవెన పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దంపతులకే కాదు ప్రేమతో కొత్త జీవితం వైపు అడుగులేస్తున్న జంటకూ వర్తించే సూచనే!
ప్రేమలో పరీక్షలు పెద్దల నుంచే వస్తాయనుకుంటారు. కానీ, అది నిజం కాదు. వంద ప్రేమల్లో పది శాతం కూడా పెద్దల దాకా పోవు. తొంబై శాతం ప్రేమలు ఫెయిలయ్యేది ప్రేమికుల మధ్య పొరపొచ్చాలతోనే. లవ్ ఫెయిల్యూర్ అనగానే కులం, ధనిక-పేద, మతం అనుకుంటారు. కానీ, ప్రేమికుల ఆలోచన, ప్రవర్తనే ప్రేమ సమస్యలకు ముఖ్య కారణాలు.
అందం.. అభిరుచి.. ఆకర్షణ.. కారణం ఏదైతేనేం? ఒకరంటే ఒకరికి ఇష్టం! ఇది స్నేహంగా కొనసాగవచ్చు. ప్రేమగా పరిణతి చెందవచ్చు. పరిణయానికీ దారితీయొచ్చు. అన్నీ అనుకూలిస్తే అందరి జీవితాల్లో ఈ ప్రేమలు ఫలించవచ్చు.
పరిచయమైన రోజుల్లో ఉన్నట్టుగా ప్రేమించుకునే రోజులు ఉండవు. సాహచర్యం అంటే భౌతికంగా కలిసి ఉండిపోవడం కాదు. ఒకరి కోసం మరొకరు జీవించడం. అందమైన బహుమతులు, ఖరీదైన వస్తువులు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్లు కొంటారు. అవి ప్రేమకు ప్రమాణాలు కావు. ‘నీ కోసం నేను, నా కోసం నీవు ఏం చేశావు’ అని ప్రేమలో ఉన్నవాళ్లు తమకు తాముగా ఆలోచించుకోవాలి. ఈ త్యాగం ఒకరికి చెప్పుకోవడం కోసం కాకూడదు. గుర్తింపు కోసం అస్సలు కావొద్దు.
‘ప్రియురాలికి ఏమి కొనిచ్చాను? ప్రియుడికి ఎంత సమయం కేటాయించాను?’ అనే ముచ్చట్ల కంటే ‘తన కోసం మార్చుకోవాల్సిందేముంది? ఎంత మారాను?’ అని ఆలోచించుకోవాలి. ఈ మార్పులకు కాలంతోపాటు చేర్పులుంటాయి. అలా ఎప్పటికప్పుడు మారే మనుషుల మధ్య ప్రేమ పెరుగుతూ పోవాలంటే ఎవరికి వారు మార్చుకోవాల్సిందే. ఒకరి కోసం మరొకరుమారిపోతుంటే బంధం బలపడుతూ ఉంటుంది. మార్పు ఆగిపోతే.. నిన్నటి దాకా ఇష్టమైన మనిషే కష్టమనిపించొచ్చు. ఆ కష్టం మనసులోకి వచ్చిందంటే అనుబంధాలు బీటలు వారతాయి.
ప్రేమలో పడ్డాక అమ్మాయిల ఇష్టాలకు అనుగుణంగా అబ్బాయిలు తమ ఇష్టాలు మార్చుకుంటారు. అబ్బాయిల ఆలోచలకు తగ్గట్టుగా అమ్మాయిలు నడుచుకుంటారు. ఇదంతా తన ప్రేమికుడి/ ప్రేయసి కోసం చేసిన త్యాగంగా భావిస్తుంటారు. కొంత కాలానికి ‘నీ కోసం నేను మారాను.. ఇష్టం లేకపోయినా అది చేశాను’ అనేస్తారు. అక్కడితో ఆగరు ‘నా కోసం నువ్వేం చేశావు?’ అని నిలదీస్తారు. ఇది సిసలైన ప్రేమ అనిపించుకోదు. ఎదుటివారికి నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. ప్రియుడి కోసమో, ప్రేయసి కోసమో కొన్ని వదులుకోవాల్సిన వచ్చినా ఇబ్బందేం లేదు. కానీ, ఈ పనులు మనస్ఫూర్తిగా చేస్తున్నావా అన్నదే ముఖ్యం.
ఎదుటి వారికోసం మారాల్సిన అవసరం లేదు. కానీ, వాళ్లతో కలిసి ఉండేందుకు నేర్పు ఉంటే చాలు. జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకరికి పాటలు ఇష్టమని ఇంకొకరు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పాడిన పాట బాగుంటే ప్రశంసించవచ్చు. బాగోలేకుంటే ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. అంతేకానీ, ‘పాడొద్దు’ అనే ఆంక్షలు విధించొద్దు. ప్రేమలో ఒకరి కోసం ఒకరు బతకడం అప్రెంటిస్లాగా చేయాలి. ఈ అనుభవం పెండ్లి తర్వాత మీ జీవితాన్ని కన్నులపండువగా మారుస్తుంది. ఇది కాకుండా పుస్తకాలపై పేర్లు, స్మార్ట్ ఫోన్ సందేశాలు, గంటలు గంటలు కాలక్షేపాలే ప్రేమ అనుకుంటే పొరపాటే. రేపటికి మిగిలేది ఎడబాటే.
మనసులోని బాధని దగ్గరి వాళ్లకే చెప్పుకొంటారు. ప్రేమికుడు, ప్రియురాలి కంటే దగ్గరివాళ్లు ఎవరుంటారు? ఆ నమ్మకంతో ‘నేను ఈ తప్పు చేశాను’ అని ఒప్పుకొంటే.. అవతలి వ్యక్తి ఆ తప్పుని మన్నించాలి. ఆ సమయంలో వారిపై కోపం రావొచ్చు. క్షమించరాని నేరం చేస్తే.. మన్నించాల్సిన పనిలేదు. అలవాటులో పొరపాటు చేస్తే మాత్రం ఆలోచించాలి. ప్రేమించిన వ్యక్తికి తన మనసులోని మాట చెప్పుకొనే వెసులుబాటు ఎప్పుడూ కల్పించాలి. తన తప్పును పెద్ద మనసుతో మన్నించానన్న అహంకారం ఉండొద్దు. ఆ తప్పు గురించి మళ్లీ ప్రస్తావించొద్దు. అది మీ స్థాయిని పెంచుతుంది. మీ ప్రేమను మరింత బలోపేతం చేస్తుంది. రేపు, మీరు తప్పు చేసినా అవతలి వాళ్లు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. తప్పుని సాకుగా చూపి ప్రేమను తెంచుకుందామనే ఆలోచన కంటే తప్పుని సరిదిద్దుకుని ప్రేమను పెంచుకుందామనే ఆలోచన జీవితాన్ని సంతోషమయం చేస్తుంది.
ప్రేమలో పంతాలు ఎక్కువైతే అప్పుడప్పుడూ మాటలు ముదురుతాయి. ‘నువ్వు నేను చెప్పేది వినడం లేదు. నువ్వు ఎప్పుడూ ఇలానే ఉండాలి’ అనే మాటలు వచ్చాయంటే ఏదో కీడు శంకించాల్సిందే. అందుకే ఇద్దరూ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. రోజంతా ప్రేమికురాలితో గడపాలని, ప్రేమికుడితో ముచ్చట్లు చెప్పుకొంటూ ఉండాలని కోరుకోవద్దు. వాళ్లకు అది సౌకర్యంగా ఉందా? సమయం ఉందా? అని గుర్తించాలి. మాటలు తగ్గితే ప్రేమ తగ్గినట్టు కాదు. ప్రేమికుడు, ప్రియురాలికి సమయం ఉంటేనే మాట్లాడేందుకు ప్రయత్నించండి. కలిసి మాట్లాడుకునేందుకూ పిలిచినా ఏ పనికీ ఆటంకం లేకుండా ఉండాలి. ‘రాలేను, మాట్లాడలేను’ అంటే ‘అంతేనా.. ఇక కటీఫ్’ అన్నట్టుగా మాట్లాడొద్దు. ఒంటరిగా ఉండేందుకు, కొన్ని రోజులు మాట్లాడకున్నా.. కంగారుపడకుండా ఉండగలగాలి. కాలేజ్, పరీక్షలు, ఉద్యోగ జీవితాలు వెతుక్కునే కాలంలో ఈ ప్రేమ పరీక్షలో గెలిస్తేనే రేపటి అందమైన జీవితానికి దారి దొరుకుతుంది.
జీవితంలో అందరూ బిజీ. ఎంత బిజీగా ఉన్నా లవర్‌కి సమయం ఇవ్వాల్సిందే. తీరిక సమయంలో మాట్లాడితే సరిపోతుందిలే అనుకోవద్దు. అవతలి వారికి అవసరమైన సమయంలో మీ సమయం కేటాయించాలి. ఆరోగ్యం బాగాలేనప్పుడు సాయపడాలి. బాధలో ఉన్నప్పుడు భుజం కాచి ఓదార్చే ఓపిక ఉండాలి. ప్రేమించిన వ్యక్తికి మాత్రమే మనసు విప్పి చెప్పుకొనే సంగతులుంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివాళ్ల మనసుని వినడం కాలక్షేపం కాదు, ఒక బాధ్యత. ఆ సమస్యను విని, సరైన సూచన చేయాలి. ఇవన్నీ జరిగేది సమయం ఇస్తేనే కదా! కాబట్టి ప్రేమను పంచుకోవడానికి, పెంచుకోవడానికి కీలకమైనది సమయమే. ఇందుకోసం తీరిక చూసుకొని పార్కులో మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు.
కలిసి భోజనం చేసేందుకు, కలిసి సినిమాలు చూసేందుకు, కలిసి ప్రయాణాలు చేసేందుకు అప్పుడప్పుడూ సమయం కేటాయించండి. కొత్త పనులు చేయడానికి ప్రయత్నించండి. డ్యాన్స్, పెయింటింగ్, పాటలు పాడటం, ఆడటం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. పాడటానికి రాగాలపై పట్టుండాల్సిన పని లేదు. స్టెప్పులు రావాల్సిన పని అంతకన్నా లేదు. ప్రేయసీప్రేమికులు ఒకరి కండ్లలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే.. అను‘రాగాలు’ అవే వస్తాయి. ఇద్దరూ కలిసి నాలుగు అడుగులు వేస్తే.. హుక్ స్టెప్ కన్నా.. హుషారుగా ఉంటుంది. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ఒకసారి ట్రై చేసి చూడండి.
ప్రేమించడం తేలిక. ఇష్టమైన వాళ్లకు దగ్గరవుతారు కాబట్టి. ఆ ప్రేమను గెలిపించుకోవడమే కష్టం. ఆ ఇష్టమైన వ్యక్తిలో ఏవో కొన్ని ఇష్టంలేని ఆలోచనలో, అలవాట్లో ఉంటాయి. అవతలి వ్యక్తి అభిరుచులు అన్నీ మనకు నచ్చకపోవచ్చు. కాబట్టి నచ్చని అభిరుచులతో నేర్పుగా కలిసిపోయినప్పుడే ప్రేమ చిక్కనవుతుంది. ఇష్టమైన వ్యక్తి దగ్గర అది కష్టం కాదు. కాకపోతే కొంచెం ఆటిట్యూడ్ మార్చుకోవాలంతే! కలిసి ఉండేందుకు వీలుగా నిన్ను నువ్వు మలచుకోవాలి. అప్పుడే ప్రేమలో రాణిస్తారు, గెలుస్తారు. అందుకే.. ‘ప్రేమ ఇచ్చావు సరే.. ఏం తీసుకున్నావ్?’ అని మీ మనసుని మీరే ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి.
– నాగవర్ధన్ రాయల