భూదాన్ పోచంపల్లి, మార్చి 26 : శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం మహిళా భక్తులు గోరింటాకును తెంచి రోకలితో నూరారు. ముత్తయిదువలకు పసుపు కుంకుమలు పెట్టి కాళ్లకు మైదాకు పారాణి పెట్టారు. పెద్దలతో పాటు చిన్నారులు సైతం మైదాకు నూరడంలో పాలుపంచుకున్నారు. శ్రీరామ జయ రామ జయ రామ అంటూ నామస్మరణ మారుమోగింది. దేవాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గోటి తలంబ్రాల కార్యక్రమానికి మహిళా భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. భద్రాచలం మాదిరిగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో గోటి తలంబ్రాల కార్యక్రమం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ బల్ల దుర్వాసులు, మహిళా ధర్మకర్తలు ఆడెపు ఎల్లమ్మ, గంజి చంద్రకళ, మహిళా భక్తులు పాల్గొన్నారు.

శ్రీరామ కల్యాణ మహోత్సవానికి మహిళలకు గోరింటాకు