నందికొండ, సెప్టెంబర్ 18 : కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి చెందారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్కాలనీవద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చేపల శ్రావణి వివాహం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రశాంత్‌తో నిశ్చయమైంది. త్వరలో వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. శ్రావణి, ప్రశాంత్ బుధవారం సరదాగా కారులో నాగార్జునసాగర్‌కు వచ్చారు. డ్యామ్‌ను చూసిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. హిల్‌కాలనీ దయ్యాలగండి సమీపంలో మూలమలుపు వద్ద ఓ లారీ.. ఫార్చునర్ కారును ఢీకొట్టింది. ఆ రెండు వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి వాగ్వాదానికి దిగారు.
ముందే ఈ ప్రదేశం ఇరుగ్గా ఉండడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రావణి, ప్రశాంత్ కూడా తమ కారును అక్కడే నిలిపారు. అదే సమయంలో నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వైపునకు సిమెంట్ లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న లారీ శ్రావణి, ప్రశాంత్ కారును ఢీకొట్టి ముందుకు దూసుకుపోయింది. దాంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న అరగంటపాటు శ్రమించి క్రేన్ సాయంతో కారులో ఇరుక్కున్న శ్రావణి, ప్రశాంత్‌ను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన శ్రావణి (37) ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ప్రశాంత్‌ను స్థానిక కమలా నెహ్రూ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంపత్ గౌడ్ తెలిపారు.