ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 14 : ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీ వర్షం కారణంగా 13 మంది రైతులకు సంబంధించిన 100 క్వింటాళ్ల వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎర్ర సోమిరెడ్డి, కావటి స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్ర సోమిరెడ్డి, యదమళ్లు, రఘుపతి రెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహ, మల్లేష్, నారాయణ రెడ్డి, యుగంధర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, పిచ్చిరెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.