బీబీనగర్, ఏప్రిల్ 09 : అవసరాల్లో వృద్ధులకు తోడుగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి సంక్షేమ సంఘం సేవలు అందిస్తుందని వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాసుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో వయో వృద్ధుల సంక్షేమ సంఘం భవన మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల సహకారంతో సంక్షేమ సంఘం భవనాన్ని నిర్మించి ప్రారంభించుకుని సంవత్సరం పూర్తయిందని తెలిపారు. భవనం నిర్మాణంలో దాతలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. వృద్ధుల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రణామ్ వయో వృద్ధుల విజ్ఞాన వినోద కేంద్రాన్ని వయో వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని, వృద్ధుల పట్ల గౌరవభావం పెంపొందించాలని సూచించారు. సంఘ కార్యవర్గ సభ్యులు, వయో వృద్దులు అందరూ కలసి సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి ఆపద వచ్చిన వయో వృద్ధులకు అండగా నిలుస్తామని, ఎవరికి ఏ ఆపద వచ్చినా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయో వృద్ధుల సంక్షేమ సంఘం ఆశ్రయ భవనం ప్రధాన కార్యదర్శి బొర్ర లింగారెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రం మనోహర్, సన్నిబోయిన ప్రసాద్, సహాయ కార్యదర్శి యాస నర్సింహారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి గొలనుకొండ ధర్మయ్య, సామ మల్లారెడ్డి, నాయకులు పలుగుల శ్రీనివాస్, సోమ ముత్యాలు, గోపాల్, ఓవల్దాస్ వీరేశం పాల్గొన్నారు.

‘వృద్ధులకు తోడుగా సంక్షేమ సంఘం సేవలు’