చౌటుప్పల్, సెప్టెంబర్ 13 : రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని లక్కారం ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో బాధిత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతులను ఒప్పించకుండా భూములను బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదన్నారు. ఓఆర్ఆర్ నుంచి అలైన్‌మెంట్‌ను 40 కిలోమీటర్లు తీసుకుని ఉత్తర, దక్షిణ భాగంలో 28 కిలోమీటర్లకు కుదించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
బడా పారిశ్రామిక కంపెనీల మేలు కోసం అలైన్మెంట్ క్రాసింగ్ చేశారని ఆయన మండిపడ్డారు. దివిస్ కంపెనీని కాపాడడం కోసమే అలైన్మెంట్ మార్పులు చేశారన్నారు. పేద రైతులు తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు కోల్పోయే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దల భూములు కాపాడడం కోసం పేదల భూములు కోల్పోయేలా మోసపూరితంగా వ్యవహరిస్తే సహించబోమని, అలైన్మెంట్ క్రాసింగ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయని యెడల తమ పార్టీ రైతులందరిని కలుపుకుని ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోదని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసినప్పుడు భూ సేకరణ అనేది రైతులకు నష్టం జరగకుండా ఉండాలన్నారు. దివిస్ కంపెనీ మేలు కోసం పేదలను ఇబ్బందులు గురి చేయవద్దన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ విలువ చెల్లించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భూ నిర్వాసితుల ఐక్య వేదిక కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పల్లె శేఖర్ రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, బచ్చనగోని గాలయ్య, కురుమిద్ద శ్రీనివాస్, దోనూరి నర్సిరెడ్డి, నడికుడి అంజయ్య, పగిళ్ల మోహన్ రెడ్డి, బోరెం ప్రకాశ్ రెడ్డి, సురుకంటి శ్రీనివాస్ రెడ్డి, పల్లె పుష్ప రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, మునగల రమణారెడ్డి, గాజుల భగత్, కొండూరు వెంకటేష్, ఉడుత రామలింగం, పల్లె మధు, మల్లేష్, టంగుటూరి రాములు, దాసరి అంజయ్య, నీళ్ల భిక్షపతి పాల్గొన్నారు.