బీబీనగర్, జూలై 23 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలని, కనీస వేతనాలు చట్టం అమలు చేసి రోజు కూలీ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూమి, కూలీ పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య తెలిపారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలోని పి.ఆర్.జి ఫంక్షన్ హాల్లో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాలకు సంబంధించిన ప్రభుత్వ భూములు లక్షలాది ఎకరాలు ఉన్నాయని వాటిని భూమిలేని పేదలకు పంచడానికి నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బందో తెలుపాలన్నారు. రాష్ర్టంలో లక్ష మందికి పైగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, వారందరికీ 120 గజాల స్థలమిచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
అనేక మంది వ్యవసాయ కార్మికులు, పేదలు తమ నివాస ప్రాంతాల్లో సరైన పనులు దొరకక, కనీస వేతనం అమలు జరగక నేటికీ వలసలు పోతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి రోజు కూలీ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, నారి ఐలయ్య, పొన్నం వెంకటేశ్వర్ రావ్, మచ్చ వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల్ల పెంటయ్య, గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌలు, ప్రజా సంఘాల నాయకులు ఎరుకలి భిక్షపతి, యస్.డి ఉమర్, మేకల బాబు, బండారి శ్రీరాములు, కొండాపురం యాదగిరి, దొడ్డి భిక్షపతి పాల్గొన్నారు.