– కాంగ్రెస్ వైఫల్యాలపై చార్జిషీట్
– అడ్డుకున్న పోలీసులు
బీబీనగర్, ఆగస్టు 16 : కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, చార్జిషీట్ విడుదల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. బీబీనగర్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోలి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో చార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పిట్టల అశోక్ మాట్లాడుతూ.. ఎన్నికలల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా ప్రచార ఆర్భాటాలు తప్పా పని చేసింది ఏమి లేదని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమస్య ఉన్నచోటికి వచ్చి ఫొటోలు దిగడం, శిలాఫలకాలు వేయడం తప్పా పూర్తిచేసిన పని ఒక్కటీ లేదన్నారు. పట్టణ కేంద్రంలో మురికి నీరు చెరువులో కలుస్తుందని సంవత్సర కాలంగా పోరాడుతున్నా ఎలాంటి స్పందన లేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని, వాటికి చిన్నపాటి పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారిని డబుల్ రోడ్డుగా మార్చాలన్నారు. పట్టణ కేంద్రంలో ఓ దాత ఇచ్చిన ఆరు ఎకరాలు భూమి ఆక్రమణలకు గురైందని, ఆ స్థలంపై విచారణ జరిపి ఆక్రమణలు తొలగించాలని కోరారు. అదేవిధంగా బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. బీబీనగర్ పట్టణం చుట్టుపక్కల ఉన్న అనేక వెంచర్ల నుండి గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10 శాతం భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరుకు బోరు నీళ్లు కలిపి సరఫరా చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం కరాబ్ అవుతుందని దుయ్యబట్టారు. బీబీనగర్ పెద్ద చెరువు కింద బుంగ ఏర్పడిందని దానిని రిపేర్ చేయాలన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక సమస్యలు ఉన్నాయని విమర్శించారు.
స్దానిక ఎమ్మెల్యే దృష్టి సారించి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అణచివేసే కార్యక్రమం మంచిది కాదన్నారు. పోలీసులను పెట్టి చార్జ్‌షీట్ విడుదల కార్యక్రమాన్ని అడ్డగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అమృతం శివకుమార్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, దేవరకొండ శ్రీనివాస్, కట్ట నరేశ్, కాట్రోత్ శివ, జాని, మిట్టు, పేరబోయిన నరేశ్ యాదవ్, పంజాల మహేశ్ గౌడ్, కుశంగుల మురళి, బోయిన కృష్ణ, ఉడుత మహేశ్, కుశంగుల రాము, మరి శ్రీకాంత్, జాడ సంతోశ్ పాల్గొన్నారు.
Bibinagar : కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం : పిట్టల అశోక్ ముదిరాజ్