– కాశీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామి పిలుపు
బీబీనగర్, మే 02 : హిందువుల సంస్కృతి రక్షణకు సమాజం సంఘటితంగా ముందుకు రావాలని కాశీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామి పిలుపునిచ్చారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గోమాత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ఆలయాల గౌరవం, పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని తెలిపారు. హిందూ సమాజాన్ని బలోపేతం చేసేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి యువతపై ప్రత్యేక బాధ్యత ఉందని, వారు ధార్మిక విలువలను పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ప్రజలు ఐక్యంగా నిలిచినప్పుడే సామాజిక సామరస్యతతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సనాతన ధర్మం, వేద సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వక్తలు గుండ్ల శారదా, బేతి కన్నయ్య మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకు సమాజం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయాల పరిరక్షణతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం, ఉప సర్పంచ్ శ్రీధర్, అధ్యక్షులు మాశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి కడెం సాయిప్రసాద్, రాష్ట్రీయ స్వయం సేవకులు నరేష్, అరవింద్, శివచరణ్, మహేష్, గోమాత సంరక్షకుడు బండారి బాబు రావు, భజన మండలి సభ్యులు, దేవస్థాన కమిటీ చైర్మన్ బాలరాజ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.