చౌటుప్పల్, నవంబర్ 27 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి వరుస కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అక్కడ మనుగడ లేదని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిత్యం ఎక్కడో ఓచోట కారు ఎక్కుతున్నారు. తాజాగా మండల పరిధిలోని తూప్రాన్ పేట గ్రామంలో గురువారం పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కతట్ల శ్రీకాంత్, బక్కతట్ల శ్రీశైలం, బక్కతట్ల శివకుమార్, చిలుకల మల్లేష్, గుండెమోని దినేశ్ వీరిలో ఉన్నారు. వీరందరినీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆ పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ ఆదేశానుసారం గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దం రమేశ్, ప్రధాన కార్యదర్శి చంచల భరత్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్మాస్పేట కృష్ణయ్య, నాయకులు బక్కతట్ల శ్రీశైలం, బక్కతట్ల లింగస్వామి, బక్కతట్ల యాదగిరి, మల్లేశ్, శ్రీధర్, ప్రవీణ్, రాజశేఖర్ పాల్గొన్నారు.