ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఇన్నోవా కారు
భువనగిరి అర్బన్: భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ, మైసమ్మ పండుగలను సంతోషంగా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగకు గ్రామ ఉప సర్పంచ్ బొబ్బిల మణెమ్మ ఇద్దరు కూతుర్లు పండుగకు వచ్చారు. తన ఇంటిలో నిర్వహిస్తున్న మల్లన్న పండుగలో భాగంగా జగదేవ్‌పూర్ రోడ్డు మార్గంలోని వడపర్తి బస్టాండ్ సమీపంలోని ప్రధాన రోడ్డు మార్గంలో కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో వెళ్లి రాత్రి 9గంటలకు పుట్ట వద్ద నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
అనంతరం అక్కడి నుంచి ట్రాక్టర్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీఎన్.తిమ్మాపూర్ గ్రామం నుంచి భువనగిరికి వస్తున్న ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ట్రాక్టర్‌ను ఎడమ వైపు ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టగా ట్రాక్టర్ పైన్న ఉన్న ఉమాదేవి మరో నలుగురు కింద పడిపోయారు. ట్రాక్టర్ ట్రాలీ ఉమాదేవి వెన్నుపూస భాగంలో పడడంతో తీవ్ర గాయాలతో ఉమాదేవి అక్కడిక్కక్కడే మృతి చెందింది.
ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న బొబ్బిలి జగత్ నడుముకు, బొబ్బిలి భగవంత్‌కు చేతికి, నడుముకు తీవ్ర గాయాలు కాగా, జనిగే లావణ్యకు కాలు విరిగింది, డోలు కొట్టేవారు(ఒగ్గోలు) రేకల శ్యామ్, దాసరి గుర్వయ్య, లక్ష్యమ్మ, తోటకూరి భాగ్యమ్మ లకు తీవ్ర గాయలు కాగా వీరందరిని ఏరియా దవాఖానకు తరిలించారు.
గ్రామ పరిధిలోని ప్రదాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో మహిళ మృతి చెందడంతో ఆందోళన చెందిన గ్రామస్తులు ఆది వారం రాత్రి 11గంటల నుంచి 12గంటలకు వరకు జగదేవ్‌పూర్-భువనగిరి ప్రదాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్‌ను వెంటనే శిక్షించాలని, మృతి చెందిన మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయా లని రాస్తారోకో నిర్వహించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ ఎస్సై కె.సైదులు తెలిపారు.