– బీఆర్ఎస్ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు
బీబీనగర్, జనవరి 06 : బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి తండా సర్పంచ్ గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ తల్లిపై చెప్పులు, బీరు బాటిళ్లు విసిరి దాడి చేయడమే కాకుండా, ఓడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంధువులను పిలిపించుకుని సర్పంచ్ ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఇల్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. తమకు ఎమ్మెల్యే అండ ఉండగా ఎవరేం చేయలేరని దుర్భాషలాడుతూ రాళ్లు, కత్తులతో దాడి చేశారని తెలిపారు.
ఇంతటి ఘటన జరిగినప్పటికీ బీబీనగర్ పోలీసులు సరైన విచారణ చేపట్టకుండా, దాడికి గురై గాయాలపాలైన వారిపైనే కేసులు నమోదు చేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, రైతు బంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, సర్పంచ్ బద్దం అంజయ్య, నాయకులు పిట్టల అశోక్, గుదే శ్రీశైలం పాల్గొన్నారు.