భువనగిరి అర్బన్, డిసెంబర్ 6:రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌లకు ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ నుంచి భారీగా నిధులు కేటాయించింది. పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని జిల్లా, మండల పరిషత్‌లకు రూ.32.7 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రం ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తున్నది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా జనాభా ప్రాతిపదికన గ్రామాలు, పట్టణాలకు నెలనెలా నిధులు జయచేస్తున్నది. దాంతో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. ప్రస్తుతం మరో దఫా నిధులు విడుదల చేయడంతో పనులు మరింత వేగంగా జరుగనున్నాయి.
ఉమ్మడి జిల్లాకు నిధుల కేటాయింపు ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. నల్లగొండలో జడ్పీతోపాటు 31 మండలాలు, సూర్యాపేట జడ్పీతోపాటు 23 మండలాలు, యాదాద్రి భువనగిరిలో జడ్పీతోపాటు 17 మండలాలు ఉన్నాయి.. నల్లగొండ జడ్పీ, మండల పరిషత్‌లకు రూ.15.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో జడ్పీ చైర్మన్‌ను రూ.7.69 కోట్లు కేటాయించగా జనరల్ ఫండ్ కింద రూ.5.71 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.1.18 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.0.80 కోట్లు మంజూరు చేసింది. నల్లగొండ జిల్లాలో 31 మండలాలకు రూ.7.58 కోట్లు కేటాయించగా జనరల్ ఫండ్ కింద రూ.5.63 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.1.16 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.0.79 కోట్లు కేటాయించింది. సూర్యాపేట జడ్పీ, మండల పరిషత్‌లకు రూ.10.27 కోట్లు కేటాయించింది.
3 జడ్పీలు.. 71 మండలాలు..
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌లతోపాటు ఉమ్మడి జిల్లాలోని 71 మండలాలకు రూ.32.7 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వాటిలో జనరల్ ఫండ్ కింద రూ.12.4 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.2.9కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1.47 కోట్లు కేటాయించింది. 71 మండలాలకు జనరల్ ఫండ్ కింద రూ.12.23 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.2.54 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.1.46 కోట్ల చొప్పున మొత్తం రూ.32.7 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా గ్రామాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 50 శాతం కేటాయించనున్నారు. మిగతా 50 శాతం గ్రామాల్లో ప్రాధాన్యతను బట్టి పనులు చేపట్టేలా త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. నిధుల విడుదలపై ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మండల పరిషత్‌లకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రాధాన్యం ఉన్న పనులను ముందుగా చేపడతాం.
గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి
జిల్లా, మండల పరిషత్‌లకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషకరం. నిధులతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. గ్రామాల్లో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. మౌలిక వసతుల కల్పనకు నిధులు వెచ్చిస్తాం.